మజ్లిస్ మాకు విరోధే

మజ్లిస్ మాకు విరోధే - Sakshi


గ్రేటర్ నేతల భే టీలో దిగ్విజయ్ ప్రకటన

పొత్తు పెట్టుకోరాదని నిర్ణయించిన టీ కాంగ్రెస్

భజరంగ్‌దళ్, ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ను నిషేధించాలన్న దిగ్విజయ్

మక్కా మసీదు పేలుళ్ల వెనుక సంఘ్ హస్తముందని ఆరోపణ    


 

 హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. మెజారిటీ పార్టీ శ్రేణులు పొత్తును వ్యతిరేకించడంతో అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. సోమవారమిక్కడ జలవిహార్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. మజ్లిస్ కాంగ్రెస్‌కు విరోధి అని ప్రకటించారు. ఈ భేటీలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, కార్యదర్శి రామచంద్ర కుంతియా, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ఒత్తిడి వచ్చినా సోనియాగాంధీ ఒప్పుకోలేదని దిగ్విజయ్ చెప్పారు. ‘హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడం బాధించినప్పటికీ, దాంతో సంబంధం లేకుండా సెటిలర్ల రక్షణకు నిలుస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్షాపూరిత రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’ అని విమర్శించారు. బీజేపీ, మజ్లిస్ పార్టీలు మత రాజకీయాలు చేస్తూ లబ్ధి  పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)లో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విషయాన్ని కొందరు అధికారులు తన దృష్టికి తెచ్చారని దిగ్విజయ్ చెప్పారు. అదే సమయంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ముస్లిం సంస్థలకు సంబంధం ఉందని మీడియాలో కథనాలు రాయడం కూడా సరైంది కాదన్నారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ల వెనుక సంఘ్ పరివార్ శక్తులున్నాయని ఆరోపించారు. భజరంగదళ్, ఇస్లామిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సంస్థలను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. 



హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించకుండా కేబినెట్‌లో తాను అడ్డుకున్నానని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు.  తెలుగుదేశం-బీజేపీ పొత్తుకు త్వరలోనే తెరపడబోతుం దని, భవిష్యత్తులో టీఆర్‌ఎస్-బీజేపీ జత కడతాయని జోస్యం చెప్పారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తల నరుక్కుంటానని ప్రకటించిన కేసీఆర్ వంద రోజుల పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయినందున ఎన్నిసార్లు తలనరుక్కుంటారో నిలదీయాలి’ అని పొన్నాల అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఝలక్ తప్పదని చెప్పారు. డీఎస్ మాట్లాడుతూ..  కేసీఆర్‌లో ఇంకా దొరతనం పోలేదని, డిప్యూటీ సీఎం రాజయ్యను అవమానించడమే ఇందుకు నిదర్శనమన్నారు. షెడ్యూల్ ప్రకారం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించకుంటే.. కేసీఆర్ భయపడుతున్నట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు.  ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశమే లేదని తెలిపారు. 178 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ మాత్రం పట్టించుకోని కేసీఆర్.. బతుకమ్మ ఉత్సవాలకు రూ.10 కోట్లు విడుదల చేయడం బాధాకరమని రేణుకా చౌదరి అన్నారు.

 

బడుగుల కోసం  ఉద్యమిద్దాం  టీ కాంగ్రెస్ విస్తృత స్థాయి భేటీలో నిర్ణయం

 

కాంగ్రెస్‌కు దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మద్దతు కూడగట్టేందుకు వారి తరఫున ఉద్యమాలు చేపట్టే దిశగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సిద్ధమవుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తమైంది. బీసీల్లోని కుల వృత్తి వర్గాలకు అండగా ఉండేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లాలని.. అసంఘటిత రంగ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారమిక్కడ గాంధీభవన్ జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశ ంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అందులో భాగంగా పలు కొత్త కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, కార్యదర్శి రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో తొలుత పొన్నాల మాట్లాడుతూ.. గత నెలలో నిర్వహించిన కార్యాచరణ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను, వాటి అమలుకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా పలువురు నేతలు సూచనలు చేశారు.

 

త్వరలో టీపీసీసీ సమన్వయ కమిటీ

 

రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. అం దులో భాగంగా 10 రోజుల్లో టీపీసీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ చైర్మన్‌గా, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్‌తోపాటు మొత్తం 8 మంది నేతలు ఉంటారు.   దిగ్విజయ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

 

3 కమిటీల ఏర్పాటు..



ఇదిలా ఉండగా.. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో ప్రధానంగా మూడు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మూడు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే నేతల వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తగిన చర్య తీసుకునే అధికారం కల్పిస్తూ ఐదుగురు సభ్యులతో క్రమశిక్షణ కమిటీని వేస్తారు. ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై పరిశీలనకు, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు 8 మంది సభ్యులతో ప్రత్యేకంగా హైపవర్ కమిటీ,  ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలను దరిచేర్చేందుకు ఏడుగురు సభ్యులతో మరో కమిటీని ఏర్పా టు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఏర్పాటైన వంద రోజుల్లో  నివేదికను  అందజేసేలా గడువు విధించాలని తీర్మానించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ పలు తీర్మానాలు చేశారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top