దిగ్విజయ్ వంచకుడు


సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ నయవంచకుడని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్(డీఎస్) మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవమానం జరిగిందని, తనకు అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. అందువల్లే ఆ పార్టీని వీడుతున్నానని.. మంచి ముహూర్తం చూసుకుని టీఆర్‌ఎస్‌లో చేరతానని చెప్పారు. గురువారం డీఎస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఆకుల లలితను తానే ప్రతిపాదించినట్టుగా దిగ్విజయ్ మాట్లాడటం పచ్చి అబద్ధమని డీఎస్ చెప్పారు.



ఎమ్మెల్సీగా తాను రిటైరైతే, తనకు చెప్పకుండా ఆకుల లలితను ఎంపిక చేశారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా 300 మందికి రెండు సార్లు ఎమ్మెల్యే బీ-ఫారాలు అందించానని... తనకు ఎమ్మెల్సీ పదవి లెక్కకాదని డీఎస్ పేర్కొన్నారు. కానీ ఆ సందర్భంగా జరిగిన అవమానమే బాధపెట్టిందన్నారు. పార్టీలో సీనియర్ అయిన తనతో మాట్లాడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు లేదా అని ప్రశ్నించారు. చెప్పుడు మాటలు విని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కావాలంటూ పార్టీలో చర్చకు తానే కారణమయ్యానని, కానీ తెలంగాణ ఏర్పాటు జాప్యం కావడం వల్ల తనకు, పార్టీకి నష్టం జరిగిందని డీఎస్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు ఆశిస్తున్న పరిపక్వతను, పరిణతిని టీపీసీసీ ప్రదర్శించలేకపోతోందని విమర్శించారు. దీనిని వ్యక్తిగతంగా జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు.





 బంగారు తెలంగాణ కోసమే..

 తెలంగాణ రాజకీయాల్లో ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత ప్రజా సంబంధాలను బంగారు తెలంగాణ కోసం వినియోగిస్తానని డీఎస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని చెప్పారు. రాజ్యసభ కోసం, ఎమ్మెల్సీ కోసం టీఆర్‌ఎస్‌లో చేరడం లేదని... పదవుల గురించి కేసీఆర్‌తో చర్చించలేదని, తనను ఎలా ఉపయోగించుకున్నా సిద్ధమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే ఆంధ్రా శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందని డీఎస్ చెప్పారు.



కాంగ్రెస్‌ను వీడాల్సిన పరిస్థితులు వస్తాయనుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియాగాంధీదే కీలకపాత్ర అయినా పార్టీని వీడాల్సిన పరిస్థితులు వచ్చాయని.. సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానని డీఎస్ వ్యాఖ్యానించారు. తనతో పాటు కాంగ్రెస్ నుంచి ఎవరినీ రావాలని కోరడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌లో ఎప్పుడు చేరాలన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మంచి ముహూర్తం చూసి చేరతానని వెల్లడించారు. టీఆర్‌ఎస్ నేతలు ఎవరూ తన చేరికను వ్యతిరేకించడం లేదని చెప్పారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top