ఉమ్మడి రాష్ట్రం వల్లే కరెంట్ కష్టాలు


  •     సమస్యను రైతులు అర్థం చేసుకోవాలి

  •      టీఈఈఏ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ

  • హన్మకొండ సిటీ : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది.. అవసరం మేరకు విద్యుత్ సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం వల్లే కరెంటు కష్టాలు.. రైతులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల అసోషియేషన్(టీఈఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.శివాజీ అన్నారు.



    గురువారం హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో ఇటీవల బాధ్యతలు స్వీకరిం చిన సీఎండీ కొంటె వెంకటనారాయణను టీఈఈఏ రాష్ట్ర, కంపెనీ నాయకులు మర్యాద ఫూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ విద్యుత్ ఉన్నంత వరకు సరఫరా చేయడానికి ఉద్యోగులతోపాటు తమ అసోసియేషన్ నుంచి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇంజినీర్లపై, సబ్‌స్టేషన్‌లపై దాడులు చేయడం ద్వారా ఒనగూరే ప్రయోజనమేమి లేదని, మరిన్ని కష్టాలు వస్తాయన్నారు. విద్యుత్ సంస్థలు డిస్కంలు, ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఐఏఎస్ క్యాడర్ వారిని నియమించొద్దని, ఇంజినీర్లను నియమించాలని తమ అసోసియేషన్ చేసిన పోరాటం ఫలించిందని తెలిపారు.



    ఒక్క ట్రాన్స్‌కో మినహా జెన్‌కో ఎండీగా, డిస్కంల సీఎండీలుగా సీనియర్ ఇంజినీర్ల నియామకం జరిగిందని పేర్కొన్నారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ అంశంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది.. ఇక్కడ పవర్ జనరేషన్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు.. కనీసం బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేద్దామన్నా రాష్ట్రంలోకి విద్యుత్ లైన్‌లు లేవు.. బయటి రాష్ట్రాల నుంచి కారిడార్ లేకుండా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అన్యాయం చేశారు’.. అని ఆదేవన వ్యక్తం చేశారు.



    బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసినా ఇప్పటికిప్పుడు కారిడార్ ఏర్పాటు చేయ డం కష్టమని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసిందని చెప్పారు. ఇంకా 2వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకొంటుందని వివరించారు. రాష్ట్రంలో 165 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం 141 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని తెలిపారు.

     

    కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామిరెడ్డి, సలహాదారులు మోహన్‌రెడ్డి, జానయ్య, ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ కార్యదర్శి విజేందర్‌రెడ్డి, ప్రతినిధులు ముక్తార్, ఎల్.సంపత్‌రావు, చంద్రప్రకాశ్, ఎన్.రవీందర్, నాగప్రసాద్, ఎస్.మల్లికార్జున్, మహేందర్‌రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top