పాలమూరును తీర్చిదిద్దుతాం

పాలమూరును తీర్చిదిద్దుతాం


కొత్తూరు : వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వారు బుధవారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

 

  ఈ సందర్భంగా మంత్రులు స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని.. దానిని నేరవేర్చడానికే మంత్రివర్గంలో జిల్లాకు ప్రాధాన్యం కల్పించినట్లు చెప్పారు.

 

 జిల్లాను అభివృద్ధి పరిచే అంశంలో తాము ప్రతిపక్షాల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని.. వారు కూడా తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా జిల్లాలో మరిన్ని బహుళజాతి పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థానికులందరికీ ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు విద్యారంగంలో మార్పులు తేనున్నట్లు వివరించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వివరించారు.

 

  రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ ఎన్నో ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోని చెరువులకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యా, నాయకులు వీర్లపల్లి శంకర్, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆర్డీఓ హన్మంతరెడ్డి, కోస్గి శ్రీనివాస్, ఏనుగు మహేందర్ రెడ్డి, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top