డిపాజిటర్లు ఆందోళన చెందొద్దు..

డిపాజిటర్లు ఆందోళన చెందొద్దు..


l   డీసీసీబీ కార్యకలాపాలపై  ప్రత్యేక దృష్టి

l   ఖాతాదారులు, డిపాజిటర్లకు అండగా ఉంటాం

l   ప్రత్యేక అధికారి, వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌


వరంగల్‌ రూరల్‌:

వరంగల్‌ డీసీసీబీ డిపాజిటర్లు, ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని, ఎవ్వరూ కూడా ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీసీసీబీ ప్రత్యేక అధికారి, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టరేట్‌లో డీసీసీబీ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు పనితీరు తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్‌ పాటిల్‌ మాట్లాడుతూ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో డిపాజిటర్లు సంయమనం పాటించాలని, ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరి డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయన్నారు.


ఇప్పటికే బ్యాంకు కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించామని, డిపాజిటర్లు, రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పాటిల్‌ తెలిపారు. డీఫాల్టర్ల జాబితా అందజేయాలి 2016–17 ఆర్థిక సంవత్సరంలో వరంగల్‌ డీసీసీబీ రూ.5కోట్ల లాభాలను ఆర్జించిందని అధికారులు కలెక్టర్‌ పాటిల్‌కు వివరించారు. అలాగే, 2015–16 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు 98శాతం రుణాల రికవరీ సాధించిందని, అదేవిధంగా బ్యాంకు రుణాలు, అప్పులు, పెట్టుబడులు, డిపాజిట్లు తదితర విషయాలపై వివరాలు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు రుణాల రికవరీపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, డిఫాల్టర్ల జాబితాతో పాటు బ్యాంకు ఖర్చులు, ఆదాయం తదితర అంశాలకు సంబంధించిన అకౌంట్స్, బ్యాలెన్స్‌షీట్‌ అందజేయాలని ఆదేశించారు.




ఫసల్‌ బీమాపై..

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫసల్‌ బీమా యోజనపై రైతులకు అవగా>హన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ఫసల్‌ బీమాపై రైతులు ఆసక్తి చూపించేలా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం నాలుగో విడత రుణ మాఫీ నిధులు విడుదల చేసిందని, జిల్లా వ్యాప్తంగా ఉన్న 19శాఖల ద్వారా కేటగిరీల వారీగా అర్హత ఉన్న రైతుల వివరాలు అందజేస్తే, ఆ వివరాల ఆధారంగా రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డీసీసీబీలో 1.50లక్షల ఖాతాలు ఉన్నాయని, ఆయా ఖాతాదారులందరూ నగదు రహిత లావాదేవీలు చేసే దిశగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సూచించారు.


ఖాతాలకు వంద శాతం ఆధార్, మొబైల్‌ సీడింగ్, చేయాలన్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న 37వేల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను సంబంధిత శాఖల ద్వారా ఖాతాదారులకు వెంటనే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష సమావేశంలో డీసీసీబీ సీఈఓ అంజయ్య, ఇన్‌చార్జి జీఎం శ్రీనివాస్, డీజీఎం మధు, అర్బన్‌ డీసీఓ కరుణాకర్, రూరల్‌ డీసీఓ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top