నీటిపారుదల శాఖలో వరుస రిటైర్మెంట్లు


  • వచ్చే మార్చి నుంచి జూలై వరకు 12 మంది ముఖ్య అధికారుల పదవీ విరమణ

  • సాక్షి,హైదరాబాద్ : రాష్ట్ర నీటి పారుదల శాఖలో ప్రస్తుతం కీలక హోదాల్లో ఉన్న పలువురు ఇంజనీర్లు వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి మొదలు జూలై వరకు వివిధ స్థాయిల్లో మొత్తంగా 12మంది సీనియర్ ఇంజనీర్లు రిటైర్ కానుండగా ఇందులో మిషన్ కాకతీయలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఇన్‌చార్జి చీఫ్ ఇంజనీర్లతో పాటు మరో చీఫ్ ఇంజనీర్, ముగ్గురు ఇన్‌చార్జి సూపరింటెండెంట్, ఐదుగురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు.



    వీరి రిటైర్మెంట్‌కు సంబంధించి సోమవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి నోటిఫికేషన్ జారీ చేశారు. రిటైర్ కానున్న సీఈల్లో విజయ్‌ప్రకాశ్ ప్రస్తుతం పరిపాలనా విభాగం ఈఎన్‌సీగా, దేవాదుల ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరిస్తున్నారు. మిషన్ కాకతీయకు సంబంధించి ఉద్యోగుల బదిలీ, పోస్టింగ్‌ల వ్యవహారంలో ఈయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయనతో పాటు చిన్ననీటి పారుదల శాఖలో గోదావరి బేసిన్ సీఈగా ఉన్న ఎం.రమేశ్, కృష్ణా బేసిన్ సీఈగా ఉన్న ఎ.రామకృష్ణారావులు రిటైర్‌కానున్నవారి జాబితాలో ఉన్నారు.



    వీరిద్దరు సైతం మిషన్ కాకతీయలో ప్రణాళిక, కార్యాచరణలో కీలకంగా ఉన్నారు. వీరి రిటైర్మెంట్ అనంతరం సీఈ పోస్టులను ఏరీతిన భర్తీ చేస్తారన్నది ప్రస్తుతం శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఏడాదికి రూ.5వేల కోట్లతో 9వేల మేర చెరువులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నా, ప్రాజెక్టులు పూర్తికావాలన్నా సీఈ పోస్టుల భర్తీ కీలకం కానుంది. వీరు రిటైరైతే  సీఈలుగా మరో ముగ్గురే  ఉంటారు.



    అదనపు బాధ్యతలు మోస్తున్న అధికారులు నలుగురు ఉండగా అందులో ఒకరికి సీనియార్టీ ప్రకారం సీఈ పోస్టు ఇవ్వడం కుదరదు. కేవలం ముగ్గురు మాత్రమే సీఈ పదవులకు అర్హులుగా ఉన్నారు. వారికి సీఈలుగా పదోన్నతి ఇచ్చినా రాష్ట్రంలో మరో నాలుగు సీఈ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందన్న అంశంపై అందరి దృష్టి ఉంది.

     

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top