లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ గుర్తింపు

లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ గుర్తింపు


మే నెలలో 4వ విడత తనిఖీలు

ఉప ముఖ్యమంత్రి కడియం స్పష్టీకరణ


 

 హైదరాబాద్: రాష్ట్రంలోని 288 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన వసతులపై మే నెలలో నాలుగో విడత తనిఖీలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మూడు విడతల తనిఖీల అనంతరం గుర్తింపు (అఫిలియేషన్) కోల్పోయిన 163 కళాశాలలు నాలుగో విడత తనిఖీల నాటికి లోపాలు సరిదిద్దుకుంటే గుర్తింపును పునరుద్ధరిస్తామన్నారు. నాలుగో విడత తనిఖీల ఆధారంగానే కళాశాలల్లో 2015-16కు సంబంధించి ప్రవేశాలు, గుర్తింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. శనివారం రెండోరోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. సదస్సు వేదిక మారియట్ హోటల్ బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల గుర్తింపు కోల్పోయిన 163 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి గుర్తింపు పొడిగింపు లభించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఏఐసీటీఈ అనుమతి లభిస్తే వర్సిటీల గుర్తింపునకు హక్కు కల్పించినట్లు కాదన్నారు.



ఇది పూర్తిగా విశ్వవిద్యాలయాల పరిధిలోని అంశమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐఐటీహెచ్, బిట్స్ పిలానీ, నీట్ సంస్థల నిపుణులతో నిర్వహించిన మూడో విడత తనిఖీల నివేదికలను ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేద విద్యార్థుల కోసమేనని, ప్రైవేటు కాలేజీల మనుగడ కోసం కాదన్నారు. 2014-15లో ప్రవేశాలు పొందిన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తామన్నారు. గుర్తింపు రద్దయిన 163 కాలేజీల్లో ప్రవేశాలు పొంది న  ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌లో జేఎన్టీయూ-హెచ్ లేదని, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాలలు ఫ్రీ జోన్ పరిధిలోకి రావన్నారు. ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సవరణలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని వర్సిటీలకు శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమిస్తామన్నారు.

 

 5 వర్సిటీలకు ఇన్‌చార్జ్ వీసీలు



రాష్ట్రంలోని 5 వర్సిటీలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్ వీసీ లను నియమించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీకి పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్‌లను ఇన్‌చార్జ్ వీసీలుగా నియమించారు. పాలమూరు, శాతవాహన, తెలుగు వర్సిటీలకు  పాతవారినే కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top