పత్తి ధర చిత్తు


ఖమ్మం వ్యవసాయం:  పత్తి ధర పతనమవుతోంది. 20 రోజుల క్రితం రూ. 5 వేల వరకు పలికిన రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తి రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు మాత్రమే పలుకుతోంది. పంట సీజన్ కానప్పటికీ ధర పడిపోవటం చర్చనీయాంశంగా మారింది. సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చే సమయంలో ధర బాగుటుందని భావించి రైతులు నిల్వ ఉంచిన పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పంటలకు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.



కొత్త పత్తి అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉండటంతో నిల్వ ఉంచిన పాత పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. ఇక్కడి పత్తిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల్లోని జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో పత్తికి అంతగా డిమాండ్ లేకపోవటంతో ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పత్తి వచ్చే సీజన్ దగ్గరలోనే ఉండటంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు సరుకు కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపటం లేదని అంటున్నారు.



 క్వింటాల్‌కు రూ.1500 వరకు తగ్గింపు..

 20 రోజుల క్రితం క్వింటాల్ పత్తి రూ.4,900 వరకు పలికింది. రోజుకు కొంత చొప్పున తగ్గుతూ వచ్చింది. సోమవారం జెండా పాట రూ.4,400 పలికింది. అయితే  వ్యాపారులు ఆ రేటు పెట్టలేదు. జెండాపాటకు ఖరీదుదారులు ముందుకు రాలేదు. మార్కెట్ అధికారులు వ్యాపారులను పిలిపించి జెండాపాట నిర్వహించారు. సరకుకు డిమాండ్ లేదని, ధర పెట్టలేమని వ్యాపారులు అధికారులకు చెప్పారు.



 రూ.4,400 జెండాపాట పలుకగా మార్కెట్‌లో రైతులు తెచ్చిన సరకులో అధికభాగానికి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకే ధర పెట్టారు. బాగా నాణ్యంగా ఉన్న కొంత సరుకుకు రూ.4 వేల వరకు ధర పడింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు దాదాపు 10 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అన్‌సీజన్‌లో ధర అధికంగా ఉంటుందని పంటను తెస్తే తీరా ఇక్కడికి వచ్చాక ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top