భారీ పెట్టుబడుల వల్లే ద్రవ్యలోటు

భారీ పెట్టుబడుల వల్లే ద్రవ్యలోటు


వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీరు, రహదారులకు అధిక ప్రాధాన్యం  

ద్రవ్యపరపతి విధానం వెల్లడించిన మంత్రి ఈటెల


  సాక్షి, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం మొదటి సంవత్సరంలోనే మౌలికవసతుల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ద్రవ్యలోటు భారీగా కనిపిస్తున్నదని, దీనిని రానున్న కాలంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడి ఉండేలా కృషి చేస్తామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ ద్రవ్యపరపతి విధానాన్ని ఆయన శుక్రవారం సభ ముందుంచారు.

 

 పన్నుల ఆదాయం పెంచుకోవడం, ప్రజాధనాన్ని ఉత్పాదకత పెంచే రంగాలపై వ్యయం చేయనున్నట్టు తెలి పారు. ఆదాయమార్గాలను పెంచుకుంటామని, పన్నుల హేతుబద్దీకరణ, లావాదేవీల వ్యయం తగ్గించుకోవడం, రెవెన్యూ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పదినెలల కాలానికి 35,378 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశామని ఇది దాదాపు 15 శాతం అధికమని వివరించారు. కాగా పన్నేతర ఆదాయం కింద అన్ని విభాగాల నుంచి రూ. 13,242 కోట్లు వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భూముల క్రమబద్దీకరణతో 6,500 కోట్లు వస్తాయని అంచనా వేసినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు.

 

 ఆదాయం అంచనా వేయలేం

 తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని గతంలో ఆదాయానికి సంబంధించి లెక్కలు లేనందున 2015-16 సంవత్సరం, 2016-17 సంత్సరానికి నిజమైన ఆదాయ అంచనా వేయడం సాధ్యం కాలేదని పేర్కొన్నారు. తెలంగాణలో 2004-05 నుంచి 2013-14 వరకు సరాసరి అభివృద్ధి రేటు 9.83 శాతంగా ఉందని, రాష్ట్ర స్థూలఉత్పత్తి 2004-05 స్థిరధరలతో పోలిస్తే రూ. 2,07,069 కోట్లు అని పేర్కొన్నారు. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే.. ఇది 5.55 శాతం అధికమని పేర్కొన్నారు. అయితే 2009-10 సంవత్సరం నుంచి అభివృద్ధి తగ్గుతూ వచ్చిందని మంత్రి సభకు వివరించారు. పారిశ్రామికరంగం బాగా దెబ్బతినగా, సేవారంగంలో పురోగతి నెమ్మదించిందని మంత్రి వివరించారు. అయినప్పటికీ, జాతీయ స్థూలఉత్పత్తితో పోలిస్తే, రాష్ట్ర పురోగతి మెరుగ్గానే ఉన్నట్టు మంత్రి వివరించారు. 2013-14 సంవత్సరంలో రాష్ట్ర స్థూలఉత్పత్తిలో సేవారంగంలో 7.15 శాతంగానూ, వ్యవసాయం 4.58 శాతం, పరిశ్రమల రంగం 2.70 శాతం ఉన్నట్టు తెలిపారు. అసంఘటిత ఉత్పత్తుల రంగంలో 2.29 శాతం, మైనింగ్, క్వారీల్లో 2.58 శాతం నెగెటివ్ గ్రోత్ ఉన్నట్టు వివరించారు. మొత్తం ఆదాయంలో 90 శాతానికి మించి ప్రభుత్వ గ్యారంటీలు ఇవ్వలేదని మంత్రి పేర్కొన్నారు.

 

 పెరిగిన వ్యక్తిగత ఆదాయం

 కాగా తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత తలసరి ఆదాయం పెరిగిందని వివరించారు. 2009-10 సంవత్సరంలో వ్యక్తిగత తలసరి ఆదాయం 51,955 రూపాయలుంటే.. 2013-14 సంవత్సరం నాటికి అది 93,151 రూపాయలకు చేరిందని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top