ఆ గోడలు.. ఈ కిటికీలు చూడు..

ఆ గోడలు.. ఈ కిటికీలు చూడు..


* 4 రోజులకే కూలితే ఎవరు బాధ్యత వహిస్తారు..

* డీఈఈపై ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం

 
*  సస్పెండ్ చేస్తే గానీ పరిస్థితిలో మార్పురాదని హెచ్చరిక

ఏటూరునాగారం :  ఆ గోడలకు పగళ్లు ఏంటి... ఈ కిటికీలకు సందులు ఏంటి అని అధికారులపై మహబూబాబాద్ ఎంపీ సీరియస్ అయ్యారు. ములుగు నియోజకవర్గంలో సోమవారం ఆయన రాష్ర్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్‌తో కలిసి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను పరశీలించడంతోపాటు ప్రారంభించారు.  



ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఉప కార్యనిర్వాహక ఇంజనీరు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన భవనాన్ని చూసి అవాక్కయ్యూరు. నాణ్యత లోపంతో చేపట్టిన పనులకు సంబంధించి డీఈఈ సత్యనారాయణపై మండిపడ్డారు.  నూతనంగా  నిర్మించిన భవనం నాలుగు రోజులకే కూలితే ఎవరు బాధ్యత వహిస్తారని డీఈని ప్రశ్నించారు. కార్యాలయం నుంచి వెనుదిరిగి పోతుం డగా అధికారులు బతిమాలాడి మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్‌ను లోనికి పిలుచుకురావడం గమనార్హం.



దీనికి సంబంధించి బిల్లులు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.  ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావు, ఈఈ గోపాల్‌రావు, డీఈఈ సత్యనారాయణ, ఏఈఈ భద్రం, జేఈఈ పాల్గొన్నారు. అదేవిధంగా ములుగు మండలం జాకారం పరిధిలో ఐటీడీఏ నిధులతో నిర్మించిన బాలికల బయోమెట్రిక్ నూతన భవనాన్ని మంత్రి చందూలాల్‌తో పాటు ఎంపీ సీతారాం నాయక్ ప్రారంభించారు. ఓ గదిలో ఏర్పాటు చేసిన కిటికీల మధ్య అధికంగా ఖాళీ ప్రాంతం ఎక్కువ ఉండడాన్ని గమనించిన ఎంపీ ఐటీడీఏ ఏఈ రాంరెడ్డిపై ఫైర్ అయ్యూరు.



ఏఈ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కలెక్టర్‌తో మాట్లాడమని ఐటీడీఏ పీఓ సుధాకర్‌రావును సీతారాం నాయక్ ఆదేశించారు. నిర్లక్ష్యంగా పనిచేసే అధికారులు ప్రభుత్వానికి అవసరం లేదని, ఇష్టం లేని వారు వెళ్లిపోవచ్చని నాయక్ ఈ సందర్భంగా అన్నారు.  సస్పెండ్ చేస్తే గానీ అధికారుల తీరులో మార్పు రాదని పేర్కొన్నారు.



ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయినా నిరుద్యోగులకు శిక్షణా కార్యక్రమాలను చేపట్టకుండా ఎందుకు కాలం గడుపుతున్నారని ఐటీడీఏ ఏపీఓ వసంతరావును ఎంపీ ప్రశ్నించారు. భవనం పూర్తయి నెలలు గడుస్తున్నా... ఇప్పటివరకు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి సరైన సామగ్రిని ఏర్పాటు చేయకపోవడంపై  అసహనం వ్యక్తం చేశారు.  15 రోజుల్లో శిక్షణ ఇవ్వడానికి కావలసిన అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top