మృత్యుఘోష

మృత్యుఘోష - Sakshi


టవేరాలో విహారయాత్రకు బయలుదేరిన ఏడుగురు స్నేహితులు తిరుపతి వెంకన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీశైలం, మహానందిలో శివుడికి పూజలు చేశారు. చిలుకూరి బాలాజీని దర్శించుకునేందుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో యుముడు వెంబడించినట్లు.. మృత్యువు తరిమినట్లు అతివేగంగా డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు.



ఆరుగురు కూర్చున్నచోటే ప్రాణాలు విడిచారు. హైదరాబాద్‌లో చదువుతున్న కొడుకును చూసి వెళ్తున్నామన్న ఆనందం మరవకముందే మృత్యువు ఓ తల్లిని కబళించేసింది. చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. ఛిద్రమైన దేహాలు.. రక్తసిక్తమైన ఈ ప్రాంతమంతా హృదయవిదాకరంగా మారింది.

 


అడ్డాకుల: మండలంలోని కొమిరెడ్డిపల్లి వద్ద జరిగిన మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగు రు స్నేహితులు, మరో మహిళ ఉన్నారు. మృతులను మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలకు చెం దిన వారిగా గుర్తించారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని నాం దేడ్ జిల్లా నాయిగావ్‌కు చెందిన ఏడుగురు మిత్రులు డ్రైవర్‌తో కలిసి టవేరా వాహనంలో ఈనెల 23న విహారయాత్రకు బయలుదేరి వెళ్లారు.



శ్రీశైలం, మహానందిని దర్శించుకుని సోమవారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. వెంకటేశ్వరస్వామి దర్శనానంతరం అదేరోజు రాత్రి 10 గంటలకు రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీని దర్శించుకునేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న టవెరా వాహనం కొమిరెడ్డిపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను దాటి పక్కరోడ్డుపై ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనాన్ని వేగంగా ఢీకొట్టి బోల్తాపడింది. అందులో ఉన్న ఆరుగురు వాహనంలోనే ప్రాణాలు విడిచారు.



టవెరాలో ఉన్న డ్రైవర్ గణేష్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. వెనుక సీట్లో ఉన్న శివదాస్ శంకర్‌రావు పడోలే, ఇన్నోవాలో ఉన్న ఫైజల్, ఆయన కొడుకు ఆసిమ్ తీవ్రంగా గాయపడ్డారు. ఫైజల్ భార్య సింధు(45) ముందు సీటులోనే మృత్యువాతపడింది. గాయపడిన గణేష్, శివదాస్‌శంకర్‌రావ్ పడోలే, ఫైజల్, ఆసిమ్‌ను చికిత్సకోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.



వీరిలో శివదాస్ మినహా ముగ్గురు స్థానిక ఎస్‌వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనస్థలానికి వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ కిషన్, అడ్డాకుల ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వర్లు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

మృత్యువులోనూ వీడని స్నేహం

నాందేడ్ జిల్లా నాయిగావ్‌కు చెందిన ఏడుగురు స్నేహితులు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవారు. వారిలో కొందరు నగల తయారీ, మరి కొందరు పాన్‌షాపు, జనరల్ స్టోర్ నిర్వహించుకునేవారు. అందరు కలిసి విహారయాత్రకు బయలుదేరారు. మొక్కుకున్న దేవుళ్లను దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. కానీ విధి వారిని మరణంలో ఒక్కటి చేసింది. టవేరా బోల్తాపడిన సంఘటనలో స్నేహితులు ఒకరిపై ఒకరు పడిపోయి సీట్లలోనే ప్రాణాలు విడిచారు. టవేరాలో స్నేహితుల మృతదేహాలను చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.

 

కొడుకును చూసి వెళ్తూ..


కేరళలోని తిరుచూరుకు చెందిన ఫైజల్ చిన్నకొడుకు హసిక్ హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో చదువుకుంటున్నాడు. ఫైజల్ ఆయన భార్య సింధు, పెద్దకొడుకు ఆసిమ్‌తో కలిసి ఇన్నోవాలో కేరళ నుంచి హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ కొడుకును చూసి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో బెలూన్ తెరుచుకోలేదు. వాహనం నడుపుతున్న ఫైజల్ సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ తెరుచుకుని ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

 

అతివేగమే ప్రాణం తీసిందా..

తిరుపతి నుంచి వేగంగా వస్తున్న టవేరా వాహనం అదుపుతప్పి తక్కువ ఎత్తులో ఉన్న డివైడర్ మీదుగా పక్కరోడ్డు మీదికి దూసుకెళ్లింది. బోల్తాపడుతూనే అదే సమయంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న ఇన్నోవాను ఢీకొట్టింది. ఫల్టీలు కొడుతూ తలకిందులుగా నిలిచిపోయింది. ఇన్నోవా మాత్రం ప్రమాదం జరిగిన చోటే నిలిచిపోయింది. సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల బెలూన్‌లు తెరుచుకోవడంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఫైజల్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ప్రమాద సమయంలో టవేరా గంటకు 140కి.మీ వేగంతో ప్రయాణిస్తుండవచ్చని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. అతివేగం, నిద్రమత్తు వల్లే ప్రమాదం జరినట్లు తెలుస్తోంది.

 

మృత్యుంజయుడితోనే వివరాలు..!

స్నేహితులను కోల్పోయిన శివదాస్‌శంకర్ స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనే మార్చురీలో ఉన్న మృతదేహాలను గుర్తించాడు. ఒక్కొక్కరి వివరాలను పోలీసులకు వెల్లడించారు. లేకుంటే మృతదేహాల గుర్తించడం కష్టసాధ్యమయ్యేది. కాగా, మృతుల బంధువులు సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

 

ఘటనస్థలాన్ని పరిశీలించిన ఆర్టీఓ

కొమిరెడ్డిపల్లి వద్ద ప్రమాదస్థలిని మహబూబ్‌నగర్ ఆర్టీఓ ఎల్.కిష్టయ్య, ఎంవీఐ వెంకటేశ్వర్లు సందర్శించారు. డివైడర్ వద్ద టవేరా పక్కరోడ్డు మీదకు వచ్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. అడ్డాకుల ఠాణాకు తీసుకెళ్లిన టవేరాను అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top