అధికారపక్షం బాధ్యతతో మెలగాలి

అధికారపక్షం బాధ్యతతో మెలగాలి

  •  ‘సాక్షి’తో ఎమ్మెల్యే చిన్నారెడ్డి

  • ఎదురుదాడి సరికాదు..

  • జగదీశ్‌రెడ్డి భాషతో మనస్తాపం కలిగింది

  • పద్దులపై చర్చలు సంతృప్తికరం

  • సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రజాసమస్యలపై అర్థవంతమైన చర్చ జరిగే విధంగా బాధ్యత వహించాల్సింది అధికారపక్షమేనని కాంగ్రెస్ శాసనసభ్యులు జి.చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన అనంతరం గురువారం ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అధికారపక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు దూకుడుగా, వ్యూహాత్మకంగా వ్యవహరించడం సహజమన్నారు. అధికారపక్షం బాధ్యతాయుతంగా, సహనంతో సభను జరపాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షమే ఎదురుదాడికి దిగడం సరైంది కాదని చెప్పారు.



     ‘మంత్రి జగదీశ్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు బాగాలేదు. ఆయన వాడిన పదజాలం, భాష తీరు నాకు తీవ్ర మనస్తాపాన్ని కలి గించింది. జగదీశ్‌రెడ్డిని ఉద్యమంలో పాల్గొనలేదని నా అభిప్రాయం కాదు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నాను’ అని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం తాను చేసిన కృషి గురించి తెలియకుండా మంత్రి జగదీశ్ మాట్లాడటం సరికాదన్నారు. 2004లో మంత్రి పదవిని ఇవ్వాలని స్వయంగా సోనియాగాంధీ సూచించినా.. మూడేళ్ల తర్వాత పదవి వచ్చిందని, దీనికి కారణం ఏమిటో సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు.   



    గత అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే కాంగ్రెస్ పనితీరు చాలా వరకు మెరుగుపడిందన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామన్నారు. కాంగ్రెస్‌లో మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పద్దులపై ఈ బడ్జెట్ భేటీల్లో చర్చ జరిగిన తీరు  బాగుందన్నారు.

     

    ఆచరణ సాధ్యం కాని బడ్జెట్ ఇదీ



    ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఆచరణ సాధ్యంకాని, మేడిపండు బడ్జెట్ అని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. గత ఏడాది లక్షకోట్ల బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్‌లో కేవలం 65 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. దీనివల్ల సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులేవీ ఖర్చుచేయలేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 79 మంది మాత్రమే అని అబద్దాలను చెబుతున్నదని చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులైనారని స్వయంగా చెప్పినా కేసీఆర్.. ఎక్స్‌గ్రేషియాను మాత్రం 530 మందికే ఇచ్చారని అన్నారు. కేజీ టు పీజీ విద్య విషయంలోనూ ఇచ్చిన హామీని అమలు చేయడం లేదన్నారు.



    ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను విడుదల చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. రైతాంగానికి సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు విషయంలోనూ ఆచరణ సాధ్యంకాని మాటలతోనే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా కేవలం కాగితాల మీదనే కేటాయింపులు చేసి ఖర్చుచేయకుండా మోసం చేసే ప్రయత్నమని చిన్నారెడ్డి విమర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top