సర్కార్ మెడలు వంచుతాం


ఫీజురీజుయింబర్స్ నిధులు విడుదల చేయిస్తాం

* విద్యార్థుల తరఫున రాజీలేని పోరాటం

* డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి


 

నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరితోనే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు వచ్చేలా చేస్తామన్నారు. గురువారం ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో ఆమె ముఖ్య పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.



అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయనందున పేద విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారిందని, వారు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఎంతవ రకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారికి పాలనా అనుభవం లేకపోవడం వల్లే ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నా ప్రభుత్వం ఫీజు రీయిం బర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున పోరాటం చేసి తప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలయ్యేలా చూస్తుందన్నారు.

 

వైఎస్సార్ ఆశయాన్ని నీరుగారుస్తున్నారు

పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారని సునీతారెడ్డి గుర్తు చేశారు. వైఎస్ హయాంలో ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారన్నారు. అయితే ఇప్పటి సర్కార్ వైఎస్సార్ ఆశయాన్ని నీరుగారుస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆమె మండిపడ్డారు.  



కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేయగా, ప్రస్తుత సర్కార్ ఆ పథకం పేరు మార్చడంతో పాటు వి ధి విధానాలు మార్చి పేద విద్యార్థులను ఇబ్బం దులు పెడుతోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులంతా భావించారని, కానీ టీఆర్‌ఎస్ సర్కార్ మాత్రం వారి ఆశలను అడియాశలు చేస్తోందన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు.

 

మానవహారం, ర్యాలీ, బైఠాయింపులు

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని  బైఠాయించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందచేశారు. సీఎం డౌన్ డౌన్, ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.



కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, జెడ్పీటీసీలు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్,  ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, ఇతర నాయకులు నాగేందర్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా, లలిత, భరత్, రమణరావు, మహ్మద్‌లతో పాటు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు కుకుడాల ఆంజనేయులు, అశోక్, విద్యార్థులు శిరీష, మోతిలాల్, కుమార్, కృష్ణప్రియ, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top