వారంలో... శంకుస్థాపన


 త్వరలో దామరచర్ల పవర్ ప్రాజెక్టు పనులు షురూ..

 టీఆర్‌ఎస్ ప్లీనరీ తర్వాత దామరచర్లకు కేసీఆర్!

 ఇప్పటికే స్టేజ్-1 క్లియరెన్స్ ఇచ్చిన

 కేంద్ర అటవీ శాఖ

 భూమి మ్యుటేషన్ చేసి హెక్టార్‌కు

 రూ.8లక్షలు చెల్లిస్తే స్టేజ్-2 అనుమతులు

 అటవీ అభివృద్ధి, రక్షణ కోసం ఆ నిధుల వినియోగం

 మెగావాట్‌కు 0.7 ఎకరాల చొప్పున మొత్తం తీసుకునేది 5వేల ఎకరాలే..


 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ :జిల్లాలోని దామరచర్ల అటవీ ప్రాంతంలో జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 6,800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయా..? సీఎం వ్యాఖ్యలు, ప్రాజెక్టు అనుమతులు.. ఇతర ఏర్పా ట్లు చూస్తుంటే.. అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. వారం రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రాజెక్టు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ‘నేను వారం రోజుల్లో వస్తా...ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తా.’ అని సీఎం కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.

 

  సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ తర్వాత ఏదో ఒకరోజు కేసీఆర్ వచ్చి పవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారని, ఒకవేళ వాయిదా పడినా మరో వారంలో పనులు ప్రారంభమవుతాయని జిల్లాకు చెందిన ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. అయితే వారం రోజుల్లోనే పనులు ప్రారంభించే యోచనలో కేసీఆర్ ఉన్న ట్టు సచివాలయ వర్గాలంటున్నాయి.

 

 తీసుకునేది 5వేల ఎకరాలే

 వాస్తవానికి ఈ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం 10వేల ఎకరాల భూమిని దిలావర్‌పూర్ రేంజ్‌లో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అత్యంత వేగంగా భూసేకరణ చేపట్టి ఈ ఏడాది జనవరి మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదికలు పంపింది. ఈ అటవీ భూమికి పరిహారంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 10వేల ఎకరాల రెవెన్యూ భూములను పరిహారంగా తీసుకోవాలని కేంద్ర అటవీశాఖకు కూడా నివేదిక వెళ్లింది. అయితే, ఈ భూమి అంతా అవసరం లేదని, కేవలం 5వేల ఎకరాలే తీసుకుంటామని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తేల్చింది. ఈమేరకు ఆ 5వేల ఎకరాలకు సంబంధించిన స్టేజ్-1 క్లియరెన్స్‌ను కూడా ఇచ్చింది.

 

 అంటే దిలావర్‌పూర్ రేంజ్‌లో గుర్తించిన భూమిలో కేవలం 5వేల ఎకరాల్లోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అంగీకారం వచ్చింది. ఒక్కో మెగావాట్‌కు 0.7 ఎకరాల చొప్పున 6,800 మెగావాట్లకు 5వేల ఎకరాలను ఇచ్చేందుకు, అదే స్థాయిలో రెవెన్యూ భూమిని తీసుకునేందుకు అనుమతిని స్తూ అటు రాష్ట్ర, ఇటు జిల్లా యంత్రాం గానికి కూడా కేంద్ర మంత్రిత్వ శాఖ ఇ ప్పటికే అంగీకార నివేదికలు పంపాయి.

 

 రూ.160 కోట్లు చెల్లిస్తే స్టేజ్-2 క్లియరెన్స్

 అయితే, ఈ భూమికి సంబంధించి పరిహారంగా 160 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీశాఖకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలంటున్నాయి. మొదటి దశ అనుమతులు వచ్చిన నేపథ్యంలో రెండోదశలో అటవీశాఖ నుంచి పూర్తిస్థాయి అనుమతి వస్తుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ భూమిని అటవీశాఖకు రెవెన్యూ వర్గాలు మ్యుటేషన్ చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత హెక్టారుకు రూ.8లక్షల చొప్పున... తీసుకునే 5వేల ఎకరాల అటవీభూమి (రెండు వేల హెక్టార్లు)కి రూ.160 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు.

 

 ఈ నిధులను  రెవెన్యూ భూములో అటవీ అభివృద్ధితో పాటు భూముల రక్షణ కోసం వినియోగించుకుంటామని ఆయన చెప్పారు. మొక్కల పెంపకం, ఫెన్సింగ్‌లు, పిల్లర్ల ఏర్పాటు కోసం ఈ డబ్బును ఖర్చు చేస్తామని, భూమిని బదలాయించి ఆ మేరకు నిధులు చెల్లిస్తే పూర్తిస్థాయి అనుమతులు వస్తాయని ఆయన వివరించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని భూములు, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థకు అప్పగిస్తున్న నేపథ్యంలో మొదటి దశ అనుమతి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభించుకునేందుకు ఎలాంటి అడ్డంకులూ లేవని తెలుస్తోంది. రెండో దశ అనుమతలు వచ్చేలోపు పనులు ప్రార ంభించవచ్చని, అయితే, ఆ అనుమతి కోసం చేయాల్సిన పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే మరో వారంలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం గమనార్హం.

 

 త్వరలోనే ప్రారంభిస్తాం

 త్వరలోనే విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులు ప్రారంభించాలనే యోచనలో ముఖ్య మంత్రి ఉన్నారు. పార్టీ సమావేశాలు ముగిసిన తర్వాత ఎంత త్వరగా వీలుంటే అంత త్వరగా ఆయన వచ్చి పనులు ప్రారంభిస్తారు.

 - గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top