దళిత సంఘాల నిరసన


దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళన

కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ దహనం


 

 సంగారెడ్డి క్రైం : దళితులపై దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ‘దళితులపై దాడుల వ్యతిరేక పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.  ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీతో శవయాత్ర జరిపి దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళితులపై దాడులు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అట్రాసిటీ కేసులను నీరుగాస్తున్న సంగారెడ్డి, రామచంద్రాపురం డీఎస్పీలను సస్పెండ్ చేయాలన్నారు.



మనోహర్‌గౌడ్ జెడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్గోయిలో 120 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామ పెత్తందార్లను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటన జరిగి నెల రోజులవుతున్నా పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. సదరు గ్రామస్తులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దళితులపై దాడులు అరికట్టాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఐదు రోజులుగా దీక్షలు చేస్తున్నా మంత్రి హరీశ్‌రావు స్పందించకపోవడం శోచనీయమన్నారు.



నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు బీరయ్య యాదవ్, ఎం.అనంతయ్య, కృష్ణంరాజు, దర్శన్, అడివయ్య, నవాజ్ మాదిగ, భూమి శ్రీనివాస్, బాలయ్య, విజయరావు, లక్ష్మయ్య, యాదగిరి, అర్జునయ్య, నిజామొద్దీన్, మురళి, రామారావు, నర్సింలు, ఎన్నార్, వెంకటేశం, డప్పు శ్రీనివాస్, ప్రశాంత్ యాదవ్, బి.కృష్ణ, వీరన్న, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top