'వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది'

'వెళ్లిపోతున్నందుకు బాధగా ఉంది' - Sakshi


హైదరాబాద్: తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే కొనసాగాలనుకున్నా.. పార్టీలోని పరిణామాలతో కొనసాగలేకపోతున్నానని పేర్కొంటూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి డి.శ్రీనివాస్ ఒక లేఖ రాశారు. పార్టీని వీడుతున్న పరిస్థితులు, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బుధవారం రాత్రే ఈ లేఖను ఫ్యాక్స్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్‌దే కీలకపాత్ర. రాష్ట్రం ఇచ్చిన ఘనతను గత ఎన్నికల్లో ఉపయోగించుకోలేకపోయాం. దానికి కారణం మీ చుట్టూ చేరిన నాయకుల తప్పుడు సలహాలు. కొందరు స్వార్థపరులు అసూయతో చేసిన ఫిర్యాదులతో తన వంటి సిన్సియర్, నిజాయతీ పరులైన నాయకులను అవమానించారు..’’ అని ఆ లేఖలో డీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్‌కు ఈ ప్రాంతంలో ఎదురే ఉండదని విశ్వసించామని, పొన్నాల లక్ష్మయ్య వంటి బలహీనమైన నాయకుడికి టీపీసీసీ పదవి ఇవ్వడంతో చాలా నష్టపోయామన్నారు.



‘జానారెడ్డి, జీవన్‌రెడ్డి వంటి నాయకులు టీడీపీ నుంచి వచ్చారు. జైపాల్‌రెడ్డి జనతాదళ్‌లో ఉన్నప్పుడు తిట్టిన తిట్లు తక్కువేమీ కాదు. అలాంటి నాయకులకు ఉన్నత పదవులు కట్టబెడుతూ.. నాలాంటి సిన్సియర్ నాయకులను అవమానించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ఈ సమయంలో నాకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వలేదు. పదవిని ఆశించిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా వేరొకరిని ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా నాతో ఎవరూ మాట్లాడలేదు. అంతకుముందు శాసనమండలిలో ప్రతిపక్షనేతగా అవకాశం ఇవ్వడంలోనూ చాలా ఇబ్బందులు పెట్టారు. తర్వాత షబ్బీర్ అలీని ఎంపిక చేయడంలోనూ దిగ్విజయ్‌సింగ్ అప్రజాస్వామికంగా వ్యవహరించారు. దిగ్విజయ్ నాపై కక్షగట్టారు. పార్టీలో రాహుల్‌గాంధీ శకం నడుస్తున్నది. రాహుల్ శకంలో రాజు, రావులదే హవా నడుస్తోంది. ఇలాంటి అవమానకర పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక, బాధాతప్త హృదయంతో పార్టీని వీడుతున్నా..’’ అని డీఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు.



నేడు రాజీనామా ప్రకటన..

డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి తన రాజీనామాను గురువారం ఉదయం 11 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. రాజీనామా చేయడానికి కారణాలను, టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఒక బహిరంగ లేఖలో వివరించనున్నారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లో రూపొందిన ఆ బహిరంగ లేఖను ఉదయం విడుదల చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top