కరెంటు బాకీ రూ.183 కోట్లు

కరెంటు బాకీ రూ.183 కోట్లు - Sakshi


ప్రజల నుంచి ముక్కు పిండి బిల్లులు వసూలు చేస్తున్న విద్యుత్ శాఖ.. ప్రభుత్వ కార్యాలయాల నుంచి బిల్లులు వసూలు చేయడంలో మాత్రం విఫలమవుతోంది. జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు కోట్లాది రూపాయల బిల్లులు బకాయి పడ్డాయి. జగమొండిగా మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి బిల్లులెలా వసూలు చేయాలో తెలియక ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 

‘ప్రభుత్వ’మే జగమొండి

* పంచాయతీల భారమే రూ. 117 కోట్లు

* తర్వాతి స్థానాలలో ‘ఎత్తిపోతలు’

* పోచంపాడ్, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లూ కోట్లలోనే..

* వసూలులో విఫలమవుతున్న అధికారులు

నిజామాబాద్ నాగారం : విద్యుత్ శాఖకు బకాయిలు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బిల్లులే అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉంటున్నాయి. సాధారణ వినియోగదారుడి నుంచి బిల్లులు వసూలు చేయడానికి స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ, బిల్లులు చెల్లించనివారి కరెంటు కనెక్షన్లు కత్తిరిస్తున్న విద్యుత్ శాఖ... ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. సెప్టెంబర్ చివరినాటికి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ. 183 కోట్ల బిల్లులు వసూలు కావాల్సి ఉంది. బకాయిలలో గ్రామ పంచాయతీలదే అగ్రభాగం.. మేజర్, మైనర్ పంచాయతీలు రూ. 117 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంది.



గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ. 37 కోట్ల విద్యుత్ బకాయిలున్నాయి. మున్సిపాలిటీలు రూ. 8.51 కోట్లు బకాయి పడగా.. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయానికి సంబంధించి రూ. 3.67 కోట్ల బకాయిలున్నాయి. కోటి రూపాయలకుపైగా బకాయి ఉన్న ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలలో పోచంపాడ్, ఆర్‌డబ్ల్యూఎస్ వర్క్స్, పోలీసు క్వార్టర్లు ఉన్నాయి. కలెక్టరేట్ సముదాయానికి సంబంధించి రూ. 63.62 లక్షల బిల్లులు వసూలు కావాల్సి ఉంది.

 

వసూలు చేస్తాం..

ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కోట్లాది రూ పాయల విద్యుత్ బకాయిలు ఉన్నాయి. సీఎండీ ఆదేశాల మేరకు బకాయి పడిన కార్యాలయాలకు నోటీసు లు జారీ చేస్తున్నాం. బకాయిలు చెల్లించకుంటే విద్యు త్ కనెక్షన్ తొలగిస్తాం.

 -ప్రభాకర్, ఎస్‌ఈ, నిజామాబాద్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top