రబీ..రెడీ

రబీ..రెడీ


సాక్షి, సంగారెడ్డి: ఖరీఫ్ సీజన్ ముగియటంతో వ్యవసాయశాఖ రబీకి సిద్ధమవుతోంది. రబీ సీజన్‌లో పంటలకు సాగుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించింది. అలాగే రబీలో అవసరమయ్యే విత్తనాలు, యూరియా సేకరణపై వ్యవసాయశాఖ యంత్రాంగం దృష్టి సారించింది. రైతులకు సకాలంలో యూరియా, విత్తనాలు సరఫరా చేసేందుకు వీలుగా చర్యలు చేపడుతోంది. మరోవైపు బ్యాంకర్లు కూ డా రబీలో రూ.573 కోట్ల రుణాలు పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు రబీ రుణాల పంపిణీకి సంబంధించి నవంబర్ మొదటివారంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు.



పెరగనున్న సాగు విస్తీర్ణం

తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ రైతన్నలకు కలిసిరాలేదు. దీంతో రైతులు రబీపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత రబీ సీజన్‌లోజిల్లాలో 1.27 వేల హెక్టార్లలో రైతులు పంట సాగు చేశారు. ప్రస్తుత రబీ సీజన్‌లో 1,30,962 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దీనికితోడు మరో 21,612 హెక్టార్లలో చెరుకు పంటను సాగయ్యే అవకాశం ఉంది.



అలాగే 47 వేల హెక్టార్లలో వరి, 13 వేల హెక్టార్లలో జొన్న, 12 వేల హెక్టార్లలో మొక్కజొన్న, 31 వేల హెక్టార్లలో శెనగ, 9 వేల హెక్టార్లలో పొద్దుతిరుగుడు, మరో 20 వేల హెక్టార్లలో వేరుశెనగ, నువ్వులు, మిరప, ఉల్లిగడ్డ, గోధుమ పంటలను రైతులు సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. రబీలో ప్రధానంగా రైతులు శెనగ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు శెనగ రైతులకు అవసరమైన విత్తనాలు సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించారు.

 

విత్తనాలు, యూరియా సేకరణపై దృష్టి


విత్తనాలు, యూరియా పంపిణీకి సంబంధించి ప్రణాళికను కూడా వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. సబ్సిడీపై విత్తనాల పంపిణీ, రైతులకు అవసరమైన యూరియా కోసం రాష్ట్ర అధికారులకు నివేదికలను అందజేశారు. రబీలో ప్రధానంగా శెనగ, వరి, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆముదం, వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారులు ఆయా పంటలకు సంబంధించి  48 వేల క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు సరఫరా చేయాల్సిందిగా రాష్ర్ట అధికారులను కోరారు.



అలాగే రబీలో 81,444 టన్నుల యూరియా అవసరమవుతుందని ప్రణాళికలో వెల్లడించారు. ఇదిలావుంటే రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ దఫా పంటల సాగు కొంత ఆలస్యం కావచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటల సాగు ఆలస్యమైనందున ప్రస్తుతం పొలాల్లో ఖరీఫ్ పంటలు అలాగే ఉన్నాయి. కోతలు పూరయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. దీనికితోడు వర్షాలు జాడలేకపోవడంంతో  ఈ సారి రబీ సాగు ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top