జనసంద్రమైన ఏడుపాయల

జనసంద్రమైన ఏడుపాయల - Sakshi


మహాశివరాత్రి జాతర ప్రారంభం

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు




సాక్షి, మెదక్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల భక్తులతో కిటకిటలాడింది. జై దుర్గాభవానీ.. హరహరమహాదేవ అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఆ ప్రాంత పరిసరాలు మారు మోగాయి. తెలంగాణతోపాటు పొరుగునే ఉన్న మహా రాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్ర మైంది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలో శివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా భవానీమాత జాతర వేడుకలను శుక్రవారం మంత్రి ప్రారంభించారు.



డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీయాదవ్, ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు  ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  భక్తులు అమ్మ వారికి పూజలు నిర్వహించటంతోపాటు మొక్కులు సమర్పించుకున్నారు. పవిత్ర మంజీరా నదిలో స్నాన మాచరించిన అనంతరం భక్తులు అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. ఉపవాసం ఆచరించిన భక్తు లు అమ్మవారిని దర్శించుకోవటం తోపాటు ఆలయ మహాగోపురం వద్ద ఉన్న శివాల యంలో అభిషేకాలు చేశారు. ఉపవాస వ్రతం ఆచరించిన సాయంత్రం 6 గంటల తర్వాత అమ్మవారి సన్నిధిలో ఉపవాసదీక్షను విరమించారు.  



తల్లీ.. విపక్షాలకు సద్బుద్ధిని ప్రసాదించు: హరీశ్‌

రాష్ట్రానికి, రైతులకు మేలు చేసే ప్రాజెక్టులను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని, వారికి ఇకనైనా సద్బుద్ధిని ప్రసాదించాలని ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ను ప్రార్థించినట్లు  మంత్రి హరీశ్‌రావు అన్నారు.    భవానీమాత ఆలయ అభివృద్ధి కోసం రూ.4 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. భక్తులు ఇబ్బంది పడకుండా  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రబీలో దుర్గమ్మ ఆశీస్సులతో ఘనపురం ఆనకట్ల కింద 18వేల ఎకరాల సాగు అయినట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి టెయిల్‌ఎండ్‌ వరకు సాగునీరు అందజేసి మొత్తం 21 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top