క్రిమినల్స్‌ వీళ్ల వయసు 13 - 18 మధ్యే..

క్రిమినల్స్‌  వీళ్ల వయసు 13 - 18 మధ్యే.. - Sakshi


► బాలల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి

►  ప్రభావం చూపుతున్న సామాజిక పరిస్థితులు, సినిమాలు




మంగల్‌హాట్‌కు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు ఫూటుగా కల్లు తాగి ఇంటికెళ్లి రూ.2 వేలు ఇవ్వాలని తల్లిని డిమాండ్‌ చేశాడు. అందుకు నిరాకరించడంతో ఆక్రోశంతో పక్కనే ఉన్న కత్తితో తల్లి గొంతులో పొడవడంతో ఆమె మరణించింది. ఆ బాలుడిని జువనైల్‌ అబ్జర్వేషన్‌ హోంకు తరలించారు. -  గత నెల మొదటివారంలో జరిగిన ఘటన ఇదీ..



పదహారేళ్ల బాలుడు చోరీలబాట పట్టాడు. స్నేహితులతో కలసి చిన్న దొంగతనాలు మొదలు తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నాలు వేయడం మొదలెట్టాడు. రెండు నెలల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో బంగారం, నగదును దొంగిలించి నాలుగోసారి పోలీసులకు పట్టుబడ్డాడు.

ప్రస్తుతం సైదాబాద్‌ జువనైల్‌ అబ్జర్వేషన్‌ హోంలో ఉన్నాడు..



సాక్షి, హైదరాబాద్‌: బాలల్లో నేరప్రవృత్తి అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా 13 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు దొంగతనాలు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సమాజంలో సంఘటనలు వీరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుండగా.. జల్సాలకు అలవాటు పడిన మరికొందరు ఇదేదారి పడుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో నెలకు సగటున 150 మంది బాలలు నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారని అంచనా. ఇలా నమోదు చేసిన కేసులకు సంబంధించిన బాలల్ని సైదాబాద్‌లోని అబ్జర్వేషన్‌ హోం (పరిశీలన గృహం)లో చేర్పించి మార్పు తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది.



ఆర్థిక స్థితి, చెడు స్నేహాలు..: నేరాలకు పాల్పడుతున్న బాలల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వలస వచ్చిన పేద కుటుంబాలు, స్లమ్‌ ఏరియాల్లో నివసిస్తున్న పిల్లలతో పాటు సింగిల్‌ పేరెంట్‌ బాలలు అధికంగా ఉంటున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. సైదాబాద్‌లోని పరిశీలన గృహంలో ప్రస్తుతం 40 మంది ఉండగా.. వీరిలో మెజారిటీ పిల్లలు దొంగతనాలకు పాల్పడినవారే. సామాజిక పరిస్థితులే కాక కొన్ని సినిమాల్లో దృశ్యాలకు ఆకర్షితులైన పిల్లలు అదేబాట పడుతున్నారు.



ఆ కేసులూ ఎక్కువే..

బాలలకు సంబంధించి నమోదవుతున్న కేసుల్లో సెల్‌ఫోన్, టూవీలర్స్‌ దొంగతనాలే అధికం. ఇక అపహరణ కేసులకు సమానంగా హింసాత్మక ఘటనలు, లైంగిక వేధింపుల కేసులు పిల్లలపై నమోదవుతున్నాయి. అల్లరి చేయడం, ఈవ్‌టీజింగ్‌ కేసుల సంఖ్యా ఎక్కువే. క్షణికావేశంలో చేసిన పొరపాట్లు వారిని ఇంటి నుంచి దూరం చేస్తున్నాయి. సెక్షన్‌ 376(పొస్కో యాక్ట్‌), సెక్షన్‌ 302, 304(మర్డర్, అటెంప్ట్‌ టు మర్డర్‌), 307(యాక్సిడెంట్‌) కేసుల్లో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలుంటున్నారు. ఇక నేరం కేసుల్లో బాలురతో పోలిస్తే బాలికలపై నమోదవుతున్న కేసులు పదిశాతం లోపే. 14 ఏళ్లు నిండి స్థితిమంతుల ఇళ్లలో పనిమనుషులుగా చేరుతున్న బాలికలు.. అక్కడి పరిస్థితుల ప్రభావంతో పనిచేస్తున్న ఇళ్లలోనే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.



150 హైదరాబాద్‌ నగరంలో సగటున నెలకు నమోదవుతున్న కేసుల సంఖ్య

సెక్షన్‌ 376(పొస్కో యాక్ట్‌), సెక్షన్‌ 302, 304(మర్డర్, అటెంప్ట్‌ టు మర్డర్‌), 307(యాక్సిడెంట్‌) కేసుల్లో 12 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలుంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top