రైతులపై క్రిమినల్ కేసులు

రైతులపై క్రిమినల్ కేసులు - Sakshi


రుణమాఫీ అక్రమార్కులపై కఠిన చర్యలు: ఈటల

    ♦ రూ.వెయ్యి కోట్ల వరకు అక్రమాలు

    ♦ భూమి లేకుండానే, ఒక్కో కుటుంబంలో ఇద్దరు రుణాలు పొందారు

    ♦ రుణాలను రెండు మూడుగా విభజించి మాఫీ పొందారు

    ♦ ఎంతటివారైనా రికవరీ చేస్తాం

    ♦ బ్యాంకర్లు సరిగా రుణాలు ఇవ్వడం లేదు: పోచారం

    ♦ ప్రభుత్వమే హామీ ఇచ్చినా పట్టించుకోవడం లేదు

    ♦ రుణమాఫీ సొమ్ము నేరుగా రైతులకే ఇవ్వాలనుకొన్నామని వెల్లడి

 సాక్షి, హైదరాబాద్: రుణమాఫీలో అక్రమాలకు పాల్పడిన రైతులపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. 'రుణమాఫీ' లో దాదాపు రూ.వెయ్యి కోట్లు పక్కదారి పట్టినట్లు తేలిందని, ప్రతి పైసా రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఈటల మాట్లాడారు. రుణమాఫీలో అక్రమాలపై ఆడిట్ విభాగం ఆరునెలల పాటు తనిఖీలు చేసి, అక్రమాలను గుర్తించిం దని తెలిపారు. ఇటీవల మెదక్ జిల్లాలోనూ పరిశీలించామన్నారు. 'భూమి లేకుండానే కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. తక్కువ విస్తీర్ణం ఉంటే ఎక్కువ విస్తీర్ణం చూపి రుణాలు తీసుకున్నారు. మరికొందరు రెండు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఒక కుటుంబంలో ఇద్దరేసి చొప్పున రుణం తీసుకున్నారు. రూ.లక్షకు మించిన రుణాలను రెండు మూడుగా విడగొట్టి రుణమాఫీ పొందారు.ఇలా వివిధ పద్దతుల్లో అక్రమంగా రుణమాఫీ పొందారు.


దాదాపు 7 శాతం అంటే వెయ్యి కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి..'అని ఈటల వివరించారు. అంతా లెక్కగడితే 10 శాతం వరకు రుణమాఫీలో అక్రమాలు జరిగి నట్లు అర్థమవుతోందని చెప్పారు. ప్రతీ పైసా న్యాయబద్ధంగా ఖర్చు కావాలన్నదే తమ అభిమతమని, రుణమాఫీలో దందాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దీనిని ఆర్థికశాఖ, బ్యాంకర్లు కలసి పర్యవేక్షించకపోతే ప్రభుత్వం అభాసు పాలవుతుందన్నారు. కరువు కాటకాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో బ్యాంకర్లు తగిన ప్రణాళిక రచించి రైతులకు సాయం చేయాలని సూచించారు.

 బ్యాంకర్లపై మండిపాటు..

 బ్యాంకులు ఆశించిన స్థాయిలో రైతులకు పంట రుణాలు ఇవ్వడం లేదని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెన్యూవల్స్ మొదలు పెట్టని బ్యాంకులు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల నుంచి వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా బ్యాంకర్లు రైతుల నుంచి వసూలు చేస్తూనే ఉండటం శోచనీయమన్నారు. 'ఇక్కడికి వచ్చిన మీరంతా వివిధ బ్యాంకులకు అధిపతులే కదా.. మీరు కిందిస్థాయి అధికారులకు చెప్పలేకపోయారా? లేకుంటే వారు అమలు చేయడం లేదా?..'అని బ్యాంకర్లను మంత్రి నిలదీశారు.


బడ్జెట్‌లో వడ్డీ లేని రుణం కింద రూ.200కోట్లు విడుదల చేశామని, అయినా ఎందుకిలా జరుగుతోందని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడలో, నల్లగొండ జిల్లాలోనూ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకుల పేర్లను మంత్రి ఈ భేటీలో ప్రస్తావించారు. ఆంధ్రా బ్యాంకు, ఎస్‌బీహెచ్‌లకు చెందిన పలు బ్రాంచీల్లో వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్పారు. పావలా వడ్డీని అమలు చేయడం లేద ని, రైతులను హింసిస్తున్నారని మండిపడ్డారు. వికాస్ గ్రామీణ బ్యాంకు ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేదని... లీడ్ బ్యాంకు అయినా ఎస్‌బీహెచ్ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు.

 మాట నిలబెట్టుకోరేం..?

 రైతులకు రుణహామీ పత్రం ఇచ్చి తాము మాట నిలబెట్టుకున్నామని, మరి బ్యాంకులు మాత్రం ఎందుకు మాట నిలబెట్టుకోవడం లేదని పోచారం ప్రశ్నించారు. 36 లక్షల రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 'రుణమాఫీ అమలు తీరుపై మొదట్లో మేం తర్జనభర్జన పడ్డాం. రైతులకే నేరుగా రుణమాఫీ సొమ్ము చెక్కులు ఇద్దామని అనుకున్నాం. చివరికి బ్యాంకులకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రకారం మొదటి విడత 25 శాతం సొమ్ము చెల్లించాం. రైతులకు మరో 30 శాతం కలిపి రుణం ఇవ్వాలని కోరాం. కానీ ఇంత చేసినప్పటికీ రైతుల నుంచి కొన్ని బ్యాంకులు మిగిలిన 75 శాతం సొమ్మును కూడా వసూలు చేశాయి. ప్రభుత్వమే హామీ ఇచ్చినా ఇలా చేస్తారా? వడ్డీ చెల్లించాలంటారా? ఇది అత్యంత తీవ్రమైన అంశం.


మీ ఆదర్శాలు ఏమయ్యాయి..'అంటూ పోచారం బ్యాంకర్లను నిలదీశారు. సెప్టెంబర్  వచ్చినా ఇప్పటివరకు ఖరీఫ్ రుణాలు రూ.6,648 కోట్లు మాత్రమే ఇచ్చారని, వరంగల్ జిల్లా గూడూరులో ఇప్పటికీ రుణాలు ఇవ్వడాన్ని ప్రారంభించనే లేదని పేర్కొన్నారు. ఎందుకిలా జరుగుతోందని, దీనిపై సరైన సమాధానం కావాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. చేతులు జోడించి వేడుకుంటున్నామని, రైతులకు రుణాలు ఇవ్వాలని, రుణ విముక్తి ధ్రువ పత్రాలు ఇవ్వాలని కోరారు. గ్రీన్‌హౌస్ సాగుచేసే రైతులకు వారు చెల్లించే 25 శాతం సొమ్ముకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top