‘ముంపు’ సమస్యల పరిష్కారానికి చర్యలు


* ఎటపాకలోనే డివిజన్ కేంద్రం

* ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు

* ముంపు ఉద్యోగులకు ఆంధ్రా నుంచే జీతాలు

* తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్


నెల్లిపాక (భద్రాచలం రూరల్): ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ చెప్పారు. ఆమె శనివారం నెల్లిపాక మండలంలో పర్యటించారు. ఎటపాకలో డివిజన్ కేంద్రం ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించారు. వైటీసీ, ప్రతిభ, నవోదయ, కేజీబీవీ భవనాలు, టుబాకో బోర్డు ప్రాంగణం పరిశీలించి వాటి వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.



అనంతరం, పురుషోత్తపట్నం ఇసుక ర్యాంపును, గోదావరి పుష్కరాల కోసం గుండాల వద్ద ఏర్పాటు చేయనున్న పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. ఆ తరువాత, విలేకరులతో మాట్లాడుతూ.. ముంపు మండలాల పాలనాసౌలభ్యం కోసం ఎటపాక కేంద్రంగా డివిజన్ ఏర్పాటవుతుందని అన్నారు. నెల్లిపాక మండలానికి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే అన్ని శాఖల్లో ఉద్యోగులను నియమించామని, త్వరలోనే ఆంధ్రా నుంచి విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ముంపు మండలాల్లోని ఉద్యోగులకు డిసెంబర్ వేతనాలు ఆంధ్రా ప్రభుత్వమే ఇస్తుందన్నారు. రాష్ట్ర ఉద్యోగుల విభజన ఇంకా జరగలేదని, పనిచేస్తున్న చోటనే వేతనాలు తీసుకోవాల్సిందేనని అన్నారు. జిల్లావ్యాప్తంగా గోదావరి పుష్కరాలకు 13 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నెల్లిపాక మండలంలోని గుండాలలో పుష్కర ఘాట్ ఉంటుందన్నారు.

 

ఇసుక అక్రమార్కులపై క్రిమినల్ కేసులు

ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు పెడతామని కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ హెచ్చరించారు. ముంపు మండలాల్లోగల గోదావరి నది నుంచి ఇసుక రవాణాకు అనుమతినిచ్చే అధికారం తహశీల్దారులకు లేదన్నారు. ఈ అధికారం ఏపీ చట్ట ప్రకారంగా ఎంపీడీఓలు, కార్యదర్శులకు మాత్రమే ఉంటుందన్నారు. ఇసుక రవాణాకు ప్రస్తుతం ఎటువంటి అనుమతులు ఇచ్చేదిలేదన్నారు. ఎవరైనా అధికారులు నిబంధనలను అతిక్రమించి అనుమతులు ఇస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



ఇసుక అక్రమ రవాణా వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆమె వెంట రంపచోడవరం ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

 చింతూరు: మండల కేంద్రమైన చింతూరులో అధికారులతో కలెక్టర్ నీతూకుమార్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముంపు మండలాల్లోని ఉద్యోగులు డిసెంబర్ నుంచి ఆంధ్రా నుంచే వేతనాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనిపై అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధిత డీడీఓలు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వేతనాలు తీసుకోకపోతే డీడీఓలే బాధ్యులవుతారని హెచ్చరించారు.

 ఎ

టపాకలో తహశీల్దార్ కార్యాలయం ప్రారంభం

నెల్లిపాక మండల తహశీల్దార్ కార్యాలయాన్ని కస్తూర్బా పాఠశాల పక్కనున్న నూతన భవనంలో శనివారం తహశీల్దార్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండి లక్ష్మి, జడ్‌పీటీసీ సభ్యుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

మైండ్ సెట్ మార్చుకోండి.. ఎక్కడుంటే అక్కడే పనిచేయూలి


కూనవరం: ‘‘మైండ్ సెట్ మార్చుకోండి ఎక్కడుంటే అక్కడే పనిచేయూలి. ఆంధ్రాలో పనిచేస్తున్నామన్న విషయూన్ని గుర్తుంచుకోండి’’ అంటూ, విలీన మండలాల ఉద్యోగులకు తూర్పుగోదావరి జిల్లా కలెక్ట్‌ర్ నీతూప్రసాద్ శనివారం క్లాస్ తీసుకున్నారు. ఆమె శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ వారైనప్పటికీ ఎక్కడ పనిచేస్తే అక్కడే జీతాలు తీసుకోవాలన్నారు.



తెలంగాణ ఉద్యోగులమంటూ పనిచేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల అన్ని బిల్లులను ఆంధ్రా ట్రెజరీకి పంపకపోతే ఉపేక్షించేది లేదన్నారు. ముంపు మండలాల్లోని వివిధ శాఖల్లోగల ఖాళీలను ఔట్‌సోర్సిం గ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. నాలుగు మండలాల పరిధిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. మండలానికి నాలుగైదు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఏజన్సీ ధ్రువపత్రాల విషయంలో సెటిల్‌మెంట్ పట్టా లేకపోతే, పూర్వీకులకు సంబంధించిన ఏదేని ఆధారం పొందుపరిస్తే సరిపోతుందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top