క్రీడాకారులు దేశ సంపత్తి

క్రీడాకారులు దేశ సంపత్తి - Sakshi


సనత్‌నగర్‌: క్రీడాకారులు దేశసంపత్తి అని, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి టి.పద్మారావు అ న్నారు. సికింద్రాబాద్‌ యశోద హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మెడిసిన్‌పై మూడు రోజులు నిర్వహించనున్న అంతర్జాతీయ వర్క్‌షాప్‌ ఆదివారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పద్మారావు మాట్లాడుతూ... ఆధునిక వైద్యాన్ని క్రీడాకారులకు అందించి దేశ కీర్తిని మరింతగా ఇనుమడింపజేసేలా యశోద ఆస్పత్రి యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మైదానంలో తరచూ గాయాలకు గురవుతున్న క్రీడాకారులు త్వరగా కోలుకుని మళ్లీ ఆటపై దృష్టిసారించేలా వారికి మెరుగైన వైద్య సేవలందించాల్సిన అవసరం ఉందన్నారు.



 ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వం లో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు విశేష ప్రాధాన్యతను ఇస్తోందన్నారు.   ఒలంపిక్‌ రజత పతక విజేత పీవీ సింధు మాట్లాడుతూ.. స్పోర్ట్స్‌ మెడిసిన్‌ కేవలం పేరొందిన క్రీడాకారులకు మాత్రమే కాకుండా ఔత్సాహిక క్రీడాకారులకు సైతం అండగా నిలిచి రాణించేందుకు సాయపడాలన్నారు. వర్క్‌షాప్‌ నిర్వాహకుడు డాక్టర్‌ నితిన్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల క్రీడా నిపుణుల అవసరాలను తీర్చగలిగే ఫిజియోథెరపిస్టులను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో మొదటిసారిగా ఈ అంతర్జాతీయ వర్క్‌షాపు ఏర్పాటు చేశామన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 850 మంది ఫిజియోథెరపిస్టులు  వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.  యూకే, పోర్చుగల్, ముంబై, పూణె, అహ్మదాబాద్, బెంగళూరులకు చెందిన స్పోర్ట్స్‌ మెడిసిన్‌ నిపుణులు వారికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, తెలంగాణ రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దినకర్‌బాబు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top