సామాజికతత్వవేత్త కేసీఆర్


హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

న్యూశాయంపేట:
సమాజ హితం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వినూత్న సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ సామాజిక తత్వవేత్తగా మారారని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కితాబునిచ్చారు. శని వారం నగరానికి వచ్చిన సందర్భంగా సర్క్యూట్‌గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సమాజంలో మంచి చేయాలనే ఆలోచన చేసే వ్యక్తి కేసీఆర్ అన్నారు. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, డ్రైవర్లు, హోంగార్డులతో పాటు జర్నలిస్టులకు అనేక సామాజిక భద్రత కార్యక్రమాలు చేపట్టారన్నారు.



గుడుంబా మహమ్మారితో గ్రామాల్లో అనేక మంది చనిపోతున్నారని దానికి ప్రత్యామ్నాయంగా చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుం దన్నారు. జిల్లాలో 265 గ్రామాల్లో అధికారయంత్రాంగం ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల కృషితో గుడుంబా నియంత్రణకు పోరాటాలు చేసి విజయం సాధించారన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజలు చైతన్యవంతులై సారా రక్కసిని పారదోలితే ప్రత్యామ్నాయ చీప్ లిక్కర్ ప్రవేశపెట్టే ఆలోచన విరమిస్తామన్నారు. దీనికి కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. తెలంగాణ ప్రజల్లో ఇంత మార్పు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పోలీ సుశాఖలో అవినీతి నిర్మూలనకు చర్యలు మొదట పోలీస్ స్టేషన్ నుంచే ప్రారంభించామన్నారు. ఎవరిని ఆశించకుండా పోలీసుస్టేషన్ల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరించే ఏర్పాటు చేసిందన్నారు.



దీంతో అవి నీతి తగ్గుముఖం పట్టిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం నూతన వాహనాలు కొనుగోలు చేసి అధికారులకు అందించామన్నారు. దీంతో ఉత్సాహం గా విధులు నిర్వహిస్తున్నారన్నారు. కిందిస్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వ రకు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు మార్గం చూపించారని కొనియాడారు. మహిళా భద్రత కోసం ‘షీ’టీంలు, ఏర్పాటు చేశామన్నారు. గోదావరి పుష్కరాలు విజయవంతం గా నిర్వహించి ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చారన్నారు. వాట ర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ ద్వారా ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు ఇస్తామన్నారు. శిథిలమైన గొలుసుకట్టు చెరువులను పునఃరుద్ధరిస్తామని పేర్కొన్నారు.



చెరువుల పూడికతీత తర్వాత గోదావరి జలాలతో చెరువులను నింపి రైతులు ఆత్మహత్యలు లేకుండా చూస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ప్రతిపక్షాల కాలికింద భూమి కదులుతోందని, అనవసర విమర్శలు మానాలని హితవు పలికారు. విమర్శలు మాని మంచి పనులకు సహకరించాలని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే శంకర్ నాయక్, నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, ముద్దసాని సహోదర్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి, ఇండ్ల నాగేశ్వర్‌రావు, నన్నపనేని నరేందర్, మహ్మద్ నయీముద్దీన్, గుడిమల్ల రవికుమార్, బోడ డిన్నా తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top