అవినీతి అంతమే లక్ష్యం

అవినీతి అంతమే లక్ష్యం - Sakshi


- అప్పుడే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది

- జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతాం

- నెలకోసారి బస్తీలకు వెళదాం

- సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్

సాక్షి,సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో ఎవరూ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా పని చేయాలనేది తన ధ్యేయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. అలా పని చేయడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.  జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల వేతనాలు పెంచుతానని తాను ఇచ్చిన హామీని అమలు చేస్తానని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి అయినా వేతనాలు పెంచుతామన్నారు. ఉద్యోగులకు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి... నైపుణ్యాలు పెంచాలని అభిప్రాయపడ్డారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ అమలు తీరుపై హెచ్‌ఐసీసీలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.



ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ పరిస్థితులు మెరుగుపడాలన్నారు. వంద మార్కెట్లు, 50 నుంచి 60 చోట్ల మల్టీలెవెల్ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూరగాయలు, మాంసం మార్కెట్లు, శ్మశాన వాటికలు, పార్కులు, బస్‌బేల పరిస్థితి బాగుపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుత.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. నెలకోసారి మళ్లీ బస్తీలకు వెళదామని... 15 మంది సభ్యులతో బస్తీ కమిటీలు వేసుకుందామని పిలుపునిచ్చారు.



డెబ్రిస్‌పై ప్రత్యేక దృష్టి

సమీక్షలో పలువురు అధికారులు తమ అనుభవాలు వివరించారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఏళ్ల తరబడి వేసిన డెబ్రిస్ గుట్టలుగా పేరుకుపోయిందని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్‌చంద్ర అభిప్రాయపడ్డారు.  బస్తీ వాసులు మొక్కల పెంపకం, పార్కుల ఏర్పాటుపై శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. చెత్త వేయడానికి ప్రజలకు స్థలం చూపించని పక్షంలో ఎంత శుభ్రం చేసినా సమస్య పునరావృతమవుతుందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు.   



ఎక్కడ వేయాలో తెలియక రోడ్డుపై వేస్తున్నట్టు జనం చెబుతున్నట్టు తెలిపారు. మరో పోలీసు అధికారి ఏకే ఖాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హెచ్‌ఐసీసీ వంటి సంపన్న ప్రాంతాల్లో సైతం చెరువుల్లో రాత్రివేళ డెబ్రిస్ వేస్తున్నారని చెప్పారు. స్థలం లేనందునే అలా వేస్తున్నామని ప్రజలు చెప్పారని తెలియజేశారు. అధికారుల అనుభవాలు విన్న సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైటెక్‌ి సటీ పాతబస్తీకి తీసిపోదని... ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.





మరో అధికారి మాట్లాడుతూ జగద్గిరిగుట్టలోని నివాస గృహాల్లో వాణిజ్య కార్యకలాపాలు పెరగడాన్ని సీఎం దృష్టికి తెచ్చారు.  15 రోజులకోమారు బస్తీ ప్రజలతో సమావేశమైతే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. వీకే అగర్వాల్, తేజ్‌దీప్‌కౌర్, సురేష్‌చంద్ర, ఎన్వీఎస్‌రెడ్డి, కళ్యాణ్‌చక్రవర్తి, బీఆర్ మీనా, చంద్రవదన్, శ్రీనివాసరెడ్డి, యాదగిరి తదితర అధికారులు తమ అనుభవాలు వివరించారు. ఈ సందర్భఃగా స్వచ్ఛ హైదరాబాద్‌పై జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ గొప్పదనాన్ని సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పాట ద్వారా వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top