మళ్లీ విద్యుత్ కారి‘డర్’!

మళ్లీ విద్యుత్ కారి‘డర్’! - Sakshi


సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సమస్యలు మళ్లీ ముసురుకుంటున్నాయి! నిరంతర విద్యుత్ సరఫరాను నిలుపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నా, సమస్యలు మాత్రం చుట్టుముడుతున్నాయి. అవసరాలకు తగ్గట్లు స్థానికంగా విద్యుదుత్పత్తి లేకున్నా, బయటి రాష్ట్రాల నుంచి కొనుగోళ్ల ద్వారా విద్యుత్ సమస్యను ప్రభుత్వం అధిగమించింది. అయితే, మళ్లీ విద్యుత్ కారిడార్ సమస్య పుట్టుకొస్తోంది. ఇంకోవైపు రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తున్న నాలుగు విద్యుదుత్పత్తి కేంద్రాల్లో గత మూడు రోజులుగా ఉత్పత్తి నిలిచిపోయింది.

 

తమిళనాడు గుప్పిట్లో ఉత్తర గ్రిడ్

ఆవిర్భావంతోనే రాష్ట్రం భారీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. దక్షిణాది నుంచి రాష్ట్రానికి విద్యుత్ తెచ్చేందుకు సరిపడా లైన్లు వున్నా, విద్యుత్ లభ్యత లేదు. ఉత్తరాదిన తక్కువ ధరకే లభిస్తున్నా, అక్కడి నుంచి తెచ్చుకోడానికి లైన్లు లేవు. ప్రస్తుతం బయటి నుంచి 2,600 మెగావాట్ల విద్యుత్‌ను తాత్కాలిక ఒప్పందాల ద్వారా రాష్ట్రం కొనుగోలు చేస్తోంది. అందులో ఉత్తరాది రాష్ట్రాల నుంచి 1,450 మెగావాట్లను, దక్షిణాది నుంచి 700 మెగావాట్లను కొంటోంది.



అయితే, ఉత్తరాది నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తున్న కారిడార్‌ను తాజాగా తమిళనాడు ఎగరేసుకుపోయింది. నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్.. ఉత్తరాది గ్రిడ్ నుంచి ఆ రాష్ట్రానికి 1,000 మెగావాట్ల కారిడార్‌ను కేటాయిం చింది. దీంతో ఉత్తరాది నుంచి రాష్ట్రానికి కరెంటు సరఫరా చేస్తున్న మార్గానికి గండిపడినట్లయింది. ప్రస్తుతం ఉత్తరగ్రిడ్‌లో రాష్ట్రానికి 200 మెగావాట్ల కారిడార్ కేటాయింపులు మాత్రమే ఉన్నట్లు సమాచారం.



ఈ కేటాయింపులు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చినా, ఇంకా తమిళనాడు ఆ కారిడార్‌ను వినియోగించుకోలేదు. దీంతో ప్రస్తుతానికి ఉత్తరాది నుంచి రాష్ట్రానికి సరఫరా యథాతథంగా జరుగుతోంది. ఒకవేళ తమిళనాడు ఈ కారిడార్‌ను వినియోగంలోకి తెచ్చుకుంటే మాత్రం ఉత్తరాది నుంచి వచ్చే 1,000 మెగావాట్లు నిలిచిపోతుంది. ప్రత్యామ్నాయ అవసరాల కోసం దక్షిణాది గ్రిడ్‌లో కారిడార్ ఉన్నా, అక్కడ విద్యుత్ లభ్యత లేదు. కారిడార్ సమస్య పునరావృతమైతే మాత్రం రాష్ట్రం మళ్లీ గడ్డు పరిస్థితులు చూడాల్సివస్తుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 

మూకుమ్మడిగా బ్రేక్‌డౌన్లు

టి.జెన్‌కోకు చెందిన రామగుండం బి.థర్మల్ విద్యుత్కేంద్రంతో పాటు రామగుండం ఎన్టీపీసీలోని ఓ యూనిట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడంతో అక్కడి నుంచి తెలంగాణ, ఏపీలకు 200 మెగావాట్ల సరఫరా ఆగిపోయింది. ఇదే సమయంలో ఏపీ జెన్‌కోకు సంబంధించి విజయవాడలోని వీటీపీఎస్‌లోని 3వ యూనిట్ సైతం ఆగిపోవడంతో 210 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ మూడు ప్రాజెక్టుల్లో 410 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోగా, అందులో తెలంగాణకు రావాల్సిన 258 మెగావాట్లకు గండిపడింది.



అలాగే విజయవాడలోని థర్మల్ టెక్ పవర్ సంస్థ నుంచి తాత్కాలిక ఒప్పందం ద్వారా రాష్ట్రం 500 మెగావాట్లను కొనుగోలు చేస్తుండగా, సాంకేతిక సమస్యలతో ఈ ప్రాజెక్టు సైతం నిలిచిపోయింది. దీంతో గత మూడు రోజులుగా రాష్ట్రానికి రావాల్సిన 750 మెగావాట్లు నిలిచిపోయింది. ఈ లోటును పూడ్చుకోడానికి తాత్కాలికంగా ఓపెన్ యాక్సెస్ విధానంలో బయటి నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top