విన్న‘పాల’పై సానుకూలం!

విన్న‘పాల’పై సానుకూలం!


♦ సహకార డెయిరీలకు ప్రోత్సాహకం

♦ కరీంనగర్, మదర్, ముల్కనూర్

♦ డెయిరీలకు ఇచ్చే యోచనలో సర్కారు

♦ మంత్రివర్గ ఉప సంఘంలో చర్చించిన మంత్రులు


 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని సహకార డెయిరీలకూ ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. కరీంనగర్, మదర్, ముల్కనూర్ డెయిరీల విన్నపాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. పాల ప్రోత్సాహకాన్ని ప్రైవేటు డెయిరీలకు చెందిన రైతులకు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ప్రభుత్వంపై పడే భారమెంత? తదితర అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు.


ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరు కాలేదు. భేటీ అనంతరం పోచారం, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 86,515 మంది రైతులకు రూ.4 ప్రోత్సాహకం ఇస్తున్నామని మంత్రి పోచారం చెప్పారు. అందులో 98 శాతం మంది 25 లీటర్ల లోపు పాలు పోసే రైతులేనన్నారు. 2 శాతం మంది 25 లీటర్లకు మించి పాలు పోసే వారున్నారన్నారు. విజయ డెయిరీకి జిల్లాల్లో 8 చిన్న డెయిరీలున్నాయని, వాటిని బలోపేతం చేస్తామన్నారు.


కల్తీలేని పాలు విజయ డెయిరీవేనన్నారు. ప్రైవేటు డెయిరీల పాలు కల్తీవన్న విమర్శలున్నాయని వ్యాఖ్యానించారు. మదర్, కరీంనగర్, ముల్కనూర్ సొసైటీ డెయిరీలు తమకూ పాల ప్రోత్సాహకం ఇవ్వాలని కోరుతున్నాయని, దీనిపై మరోసారి జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు పాల ప్రోత్సాహకం బకాయిలను వారంలోగా చెల్లిస్తామన్నారు. పాల ఉత్పత్తికి విధానం తీసుకొస్తామని మంత్రి జగదీశ్ పేర్కొన్నారు. ఇతర దేశాల్లోనూ పాల ఉత్పత్తికి సంబంధించి ఉన్న విధానాలను అధ్యయనం చేస్తామన్నారు.


 వాటికి ప్రోత్సాహకం ఎలా ఇస్తారు?

మదర్, కరీంనగర్ డెయిరీలకు ప్రోత్సాహకం ఎలా ఇస్తారని తెలంగాణ ఆదర్శ పాడి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బాల్‌రెడ్డి విమర్శించారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు మాత్రమే ప్రోత్సాహకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికే డబ్బులు ఇవ్వడానికి నిధులు లేవని చేతులెత్తేసిన సర్కారు పెద్ద ప్రైవేటు డెయిరీలకు కూడా ఇవ్వాలనుకోవడం శోచనీయమన్నారు. పాల ప్రోత్సాహకంపై సలహాలతో వారంలో నివేదిక ఇవ్వాలని తమ సంఘాన్ని మంత్రివర్గ ఉపసంఘం కోరిందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top