ఇసుకాసురులపై నిఘా నేత్రం

ఇసుకాసురులపై నిఘా నేత్రం - Sakshi


సాక్షి ప్రతినిధి, ఖమ్మం  : ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టడంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా పెద్ద పెద్ద ఇసుక రీచ్‌లుగా గుర్తింపు పొందిన జిల్లాలోని పాయింట్లలో హై రిజొల్యుషన్ క్లోజ్డ్ సర్క్యూట్ (హెచ్‌ఆర్‌సీసీ)లను ఏర్పాటు చే సి ఎప్పటికప్పుడు ఇసుక తరలింపు ఎలా జరుగుతుందనే దాన్ని నిక్షిప్తం చేయనున్నారు.



ఈ సీసీ కెమెరాలను సమీప పోలీస్‌స్టేషన్‌తో అనుసంధా నం చేస్తామని, ఇసుక పాయింట్లలో జరిగే తతంగాలను స్టేషన్ ద్వారా పరిశీలించి అక్రమ రవాణా జరగకుండా అడ్డుకుంటామని అధికారులు చెపుతున్నారు. ఈ మేరకు ఐదు పాయింట్లను గుర్తిం చిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు వాటిని త్వరలోనే ఏర్పాటు చేసేందుకు చకచకా చర్యలు తీసుకుంటున్నారు.

 

రీచ్‌లో ఏం జరిగేది క్షణాల్లో పోలీస్‌స్టేషన్‌కు..



జిల్లాలోని గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో, కిన్నెరసాని, ముర్రేడు, మున్నేరు లాంటి వాగుల్లో పెద్ద ఎత్తున ఇసుక రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల ద్వారా ఏటా సుమారు కోట్ల రూపాయల విలువైన ఇసుక తరలిస్తారు. ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.



అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు కూడా జిల్లా నుంచి ఇసుక తరలిపోతోంది. అయితే, ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా వెళుతున్న ఇసుకను అడ్డుకునే క్రమంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. చెక్‌పోస్టుల్లో సైతం తగినంత సిబ్బంది లేకపోవడం, ఇసుకాసురులిచ్చే సొమ్ములకు కొందరు ప్రభుత్వ సిబ్బంది ఆశపడుతుండడం, రాత్రివేళల్లో సరైన గస్తీ లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా మూడు లారీలు, ఆరు ట్రాక్టర్లుగా వర్ధిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఎంత ప్రయత్నించినా ఇసుక దందాను నియంత్రించ లేకపోతున్నారు.

 

నిర్దిష్టంగా ఎవరిపై చర్యలు తీసుకునే, కేసు నమోదు చేసే అవకాశం లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. హైరిజొల్యుషన్ ఉన్న సీసీ కెమెరాలను ఇసుక పాయింట్లలో ఉంచడం ద్వారా ఏ వాహనం ఎన్ని సార్లు ఇసుకను తీసుకెళ్లింది గుర్తించవచ్చనే ఆలోచనతో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.



మైనింగ్ శాఖ గుర్తించిన విధంగా నాయకన్‌గూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, లక్ష్మీదేవిపల్లి ప్రాంతాల్లో ఈ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల ద్వారా వాహనం నంబర్‌తో పాటు డ్రైవర్‌ను కూడా గుర్తించవచ్చని, తద్వారా ఒకే వేబిల్లుపై అనేక ట్రిప్పులు కొట్టి అటు అక్రమ రవాణా చేయడంతో పాటు ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను నియంత్రించవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. సురేంద్రమోహన్ ‘సాక్షి’తో చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశామని, ఈ కెమెరాల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది..? ఆచరణలో ఎలా సాధ్యమనేది పరిశీలించి త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని ఆయన వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top