గ్రామీణాభివృద్ధికి కృషి

గ్రామీణాభివృద్ధికి కృషి - Sakshi


జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి



ధారూరు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అన్నారు. సోమవారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉమాపార్వతి పాలకవర్గం పదవీబాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఎంపీపీ చాంబర్‌లో జరిగిన పూజా కార్యక్రమంలో ఆమె పాల్గొని నూతనంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, పాలకవర్గానికి  శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి చెందిందని చెబుతున్నా గ్రామీణప్రాంతాలు ఇంకా అభివృద్ధికి దూరంగానే ఉన్నాయన్నారు.

 

భవిషత్తరాలకు కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని, లేకుంటే వారు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నిధుల్లో ప్రతి పైసా పేదప్రజలకు చెందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ఉద్యోగులు సహకరించాలని కోరారు. పార్టీలకతీతంగా అభివృద్ధికి సహకరిస్తే మావంతుగా అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న ధారూరులోని సమావేశపు హాలు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

 

వికారాబాద్ ఎంఎల్‌ఏ బి. సంజీవరావు మాట్లాడుతూ జిల్లాలో ధారూరు మండలం పూర్తిగా వెనుకబడి ఉన్నందున అభివృద్ధి పనులకు ఎక్కువ శాతం నిధులు కేటాయించాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను కోరారు. గతంలో రూ.5 కోట్లు మీరే మంజూరుచేశారని అయన గుర్తు చేశారు.  సమావేశంలో   సునీతారెడ్డిని ఎంఎల్‌ఏసంజీవరావు, జెడ్పీటీసీ పి.రాములు, ఎంపీపీ, వైస్ ఎంపీపీలను శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.



ఈ సమావేశంలో ఎంపీపీ ఉమా పార్వతి. ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ధారూరు సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ యూనూస్,  పార్టీ నాయకులు రవీందర్‌రెడ్డి, సంతోష్‌కుమార్, రాజేందర్‌రెడ్డి, రాములు యాదవ్, కుమ్మరి శ్రీనివాస్, మల్లారెడ్డి, నాగార్జునరెడ్డి, వరద మల్లికార్జున్, అవుసుపల్లి అంజయ్య, కావలి అంజయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top