వినియోగదారుల ఫోరంపై హైకోర్టు కీలక సందేహం


  • ఉన్న దానిపై స్పష్టతనివ్వకుండా తిరిగి ఫోరంలు  ఏర్పాటు చేయవచ్చా..?

  • సందేహం వ్యక్తం చేసిన జస్టిస్ నాగార్జునరెడ్డి

  • విచారణ డిసెంబర్ 29కి వాయిదా

  • సాక్షి, హైదరాబాద్: ఏపీ వినియోగదారుల ఫోరం ఉండగానే, దాని సంగతి తేల్చకుండా ఇరు రాష్ట్రాలూ కూడా తమ తమ రాష్ట్రాలకు కొత్త వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టు శుక్రవారం కీలక సందేహాన్ని లేవనెత్తింది. ప్రస్తుతం ఉన్న వినియోగదారుల ఫోరం పరి స్థితి ఏమిటో స్పష్టతనివ్వకుండా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేస్తూ జీవోలు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.



    ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు. తెలంగాణకు ప్రత్యేక ఫోరం ఏర్పాటు కావడంతో ప్రస్తుత కమిషన్ తెలంగాణ రాష్ట్ర కేసులను విచారించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, దీనివల్ల కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ఫోరంను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ తెలంగాణ రాష్టానికి ఉందని, అయితే ప్రస్తుత ఫోరం ఉండగానే మరో ఫోరంను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమని వివరించారు.



    ప్రస్తుత ఫోరంపై స్పష్టతనివ్వకుండా, అసలు వినియోగదారుల రక్షణ చట్టం 1986లోని నిబంధనలకు సవరణలు చేయకుండా  ఇరు రాష్ట్రాలూ   స్వతంత్ర వినియోగదారుల ఫోరాలను ఏర్పాటు చేసుకోవచ్చా.. అని న్యాయమూర్తి సందేహం వ్యక్తం చేశారు. దీనిపై వాదనలు వినిపించాలని ఇరు రాష్ట్రాల అడ్వకేట్ జనరళ్లను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ ద్వారా తమ వైఖరి ఏమిటో తెలియ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించారు. తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేస్తూ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top