అవ్వా.. ఇంకా ఆరుబయటకే!!

అవ్వా.. ఇంకా ఆరుబయటకే!! - Sakshi


లక్ష్యం ఘనం.. ఆచరణ నామమాత్రం

- మొక్కుబడిగా మరుగుదొడ్ల నిర్మాణం

- మంజూరైనవి 3,333... పూర్తయ్యింది 869.. చెల్లించింది...76

- ప్రతిబంధకంగా ఆన్‌లైన్ నిబంధన

- శ్రద్ధచూపని అధికారులు..  బిల్లులు రాక తిప్పలు పడుతున్న లబ్ధిదారులు

అరవైతొమ్మిదేళ్ల స్వతంత్ర భారతావనిలో ఆ..అవసరాలు తీర్చుకోవడానికి పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇంకా ఆరుబయటకే వెళ్లాల్సి వస్తోంది. ఇంటికో మరుగుదొడ్డి ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా.. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. తాజాగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసిన వారికి బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.

 - సంగారెడ్డి మున్సిపాలిటీ


 

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు రెండు నగర పంచాయతీలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 10వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం 3333 మందికి మాత్రమే మంజూరు చేశారు. నిర్మాణం పూర్తిచేసిన ప్రతి లబ్ధిదారుడికి రూ.12వేలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.8 వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు చెల్లిస్తుంది.



గుంతలు తీసి రింగులు వేశాక మొదటి విడత బిల్లులు చెల్లించాల్సి ఉంది. గోడ నిర్మాణం, డోర్లు బిగించాక ఇంజినీరింగ్ అధికారి పరిశీలించి ఆ ఫొటోను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తేనే రెండో విడత బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కానీ అధికారుల్లో కొరవడిన సమన్వయంతో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియనే పూర్తికాలేదు. మరో వైపు నిర్మాణాలు పూర్తి చేసిన వారికి వివిధ కారణాలతో బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో మిగతా వారు ముందుకు రావడం లేదు. అయితే ప్రతిదీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాకే బిల్లులు చెల్లింపులు చేయాలనే నిబంధన విధించడంతో పనుల్లో ఆలస్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

 

బిల్లుల కోసం ఎదురు చూపులు

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డిలో 252 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయగా 235 మంజూరు చేసి కేవలం 14మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. సదాశివపేటలో 140 దరఖాస్తులు రాగా కేవలం ఎనిమిది మాత్రమే పూర్తయ్యాయి. సిద్దిపేటలో 1026 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయగా 236 పూర్తి కాగా 42 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. జహీరాబాద్‌లో 522, మెదక్‌లో 405, గజ్వేల్‌లో 838, జోగిపేటలో 156 దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్లో పొందుపర్చారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 3,333 దరఖాస్తులు ఆన్‌లైన్ చేయగా 869 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 76 మరుగుదొడ్లకు మాత్రమే చెల్లింపులు చేశారు. దీంతో మిగతా లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top