వెలుగుల వెనుక అక్రమాల చీకటి..!

వెలుగుల వెనుక అక్రమాల చీకటి..! - Sakshi


జలాశయాల నిర్మాణంలో అవకతవకలు

* బహిర్గతమవుతున్న నాణ్యతాలోపాలు

* కాంట్రాక్టర్‌కు వంతపాడిన అధికారులు

* జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనుల తీరు

* బిల్లులు ఆపాలని లోకాయుక్త ఆదేశాలు


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సింగరేణి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో భాగంగా చేపట్టిన జలాశయం పనుల్లో భారీ అవకతవకలు వెలుగు చూస్తున్నాయి.  ఈ జలాశయాలను నిర్మించి కొద్దిరోజులు కూడా గడవక ముందే బీటలు వారడంతోపాటు వేసిన నాపరాళ్లు చెల్లాచెదురు అయిపోయాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన సివిల్ పనుల్లో అవకతవకలు వెలుగుచూస్తున్నాయి.



బొగ్గు ఉత్పత్తితోపాటే సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి వద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. రూ.8,250 కోట్ల అంచనా వ్యయంతో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ ఈ నెల 6న జాతికి అంకితం చేసిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టు సివిల్ పనుల్లో అధికారులు, గుత్తేదార్లు కలసి రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడినట్లు  ఆరోపణలు వినిపిస్తున్నాయి. జైపూర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం మూడు టీఎంసీల నీళ్లు అవసరమని నిర్ణయించారు. ఇందుకోసం గోదావరి, ప్రాణహిత నదుల నుంచి ప్రత్యేకంగా నిర్మించిన పైప్‌లైన్ల ద్వారా నీటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి తరలిస్తారు.



ఈ నీటిని నిల్వ చేసేందుకు ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన ఒక జలాశయాన్ని రూ. 14 కోట్ల అం చనా వ్యయంతో, రెండు టీఎంసీల సామర్థ్యం కలిగిన మరో జలాశయాన్ని రూ. 45 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని నిర్ణయిం చారు. అయితే, ఈ అంచనాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయి. కాంట్రాక్టరుకు కలిసొచ్చేలా అధికారులు ఈ జలాశయాల అంచనాలను పెంచారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.  

 

నాసిరకం సిమెంట్ వాడకం..

ఈ జలాశయాల నిర్మాణం పనులకు నిబంధనల ప్రకారం బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) సర్టిఫికేషన్ కలిగిన సిమెంట్‌ను వాడాల్సి ఉంటుంది. కానీ.. చౌకబారు రకం సిమెంట్‌ను వాడారు.  జలాశయం.. నిర్మించిన కొన్ని రోజులకే బీటలు వారింది. సిమెంట్‌తో అతికించిన నాపరాళ్లు ఎక్కడికక్కడ ఊడిపోయాయి. మరోవైపు మొదటి జలాశయం నీళ్లు లీకేజీ అవుతున్నాయి. క్యూసీ సర్టిఫికెట్ ఇవ్వకుండానే అధికారులు కాంట్రాక్టరుకు రూ.కోట్లలో బిల్లులు కట్టబెట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

 

మట్టిలో కాసుల వేట

రెండో జలాశయం కోసం తవ్విన మట్టిని వేరే ప్రాంతానికి తరలించేలా అంచనాలు రూపొందించారు. ఈ మేరకు వేల క్యూబిక్ మీటర్ల మట్టి రవాణాకు కోసం బిల్లులు చెల్లించారు. కానీ, ఇక్కడ కాంట్రాక్టరు, అధికారులు కలసి జిమ్మిక్కులకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మొదటి జలాశయం కోసం తవ్విన మట్టితోనే రెండో జలాశయం పనులకు వినియోగించారు. కానీ, ఎంబీ రికార్డుల్లో మాత్రం వేరేగా పేర్కొంటూ బిల్లులు డ్రా చేశారు. ప్రమాణాలేవీ పాటించకపోవడంతో జలాశయం నుంచి నీళ్లు లీకవుతున్నాయి.

 

వినియోగదారుల మండలి న్యాయ పోరాటం..

ఈ పనులపై వినియోగదారుల మండలి వారు ఇచ్చిన ఫిర్యాదు నం.1684/2016/బి1ను స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి నాణ్యత లేని పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు తక్షణం బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top