‘గూడుపుఠాణి

‘గూడుపుఠాణి


సాక్షి, కరీంనగర్ :

 ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై 36 రోజులపాటు చేస్తున్న సీబీసీఐడీ విచారణలో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం మూడు మండలాల్లో.. అదీ తొలి విడత విచారణలోనే 710 మంది అక్రమార్కులున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి విచారణ, రికార్డులు లోతుగా పరిశీలిస్తే సంఖ్య వెయ్యి దాటుతుందని స్వయంగా అధికారులే పేర్కొంటున్నారు. మరోవైపు అక్రమార్కులపై దసరా తర్వాత చర్యలు తీసుకునేందుకు సర్కారు నిర్ణయించింది. తొలి విడత క్షేత్రస్థాయి విచారణను రెండు రోజుల్లో పూర్తి చేసి.. రికార్డులు పరిశీలించేందుకు సీఐడీ బృందాలు కసరత్తు చేస్తున్నాయి. పరిశీలన ఐదురోజుల్లోగా పూర్తి చే సి నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఐడీ డీఎస్పీ మహేందర్ నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ దూకుడు.. ప్రభుత్వ వైఖరితో ఇందిరమ్మ ఇళ్ల అనర్హులు.. దళారులు.. ప్రజాప్రతినిధుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

 గత నెల 14 నుంచి మల్హర్ మండలం రుద్రారం, మహాముత్తారం మండలం పెగడపల్లి, వీణవంక మండలం రెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో సీఐడీ డీఎస్పీ మహేందర్, సీఐ రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. వీటి పరిధిలో మంజూరై.. నిర్మాణం పూర్తయిన ఇల్లు మొత్తం 2708 ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణ  బృందాలు నిగ్గు తేల్చాయి. వెయ్యికి పైగా మంది అక్రమార్కులు ఉంటారని సీఐడీ చెబుతోంది. కేవలం మూడు మండలాలు.. నాలుగు గ్రామాల్లోనే వెయ్యి మందికి పైగా అక్రమార్కులున్నారంటే జిల్లావ్యాప్తంగా ఇంకెంత మంది అక్రమార్కుల బండారం బయటపడుతుందోననే చ ర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది. అక్రమార్కుల్లో గృహనిర్మాణశాఖ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పారిశ్రామిక వేత్తలు, సింగరేణి కార్మికులూ ఉన్నారని సీఐడీ విచారణలో తేలింది. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు.

 రెండో విడత జిల్లావ్యాప్తంగా..?

 ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై తొలి విడతగా ప్రభుత్వం జిల్లాలోని రెండు నియోజకవర్గాలు.. నాలుగు గ్రామాల్లో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విచారణ పూర్తయిన తర్వాత సీఐడీ విచారణ అధికారులు ఇచ్చే నివేదికల అనుగుణంగా రెండో విడత విచారణ చేపట్టాలని యోచిస్తోంది. అన్ని చోట్లా ఊహించని విధంగా అక్రమాలు వెలుగులోకి రావడం.. విచారణలో అవి నిర్ధరణ కావడంతో రెండో విడత విచారణ జిల్లావ్యాప్తంగా చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విచారణ కోసం సీఐడీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక

 చే యాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క ఇప్పటి వరకు చేపట్టిన విచారణలో సీఐడీ అధికారులకు లభించిన హౌసింగ్ సిబ్బంది సహకారం అంతంతే. విచారణకు సహకరించని హుజూరాబాద్ డీఈఈని హౌసింగ్ పీడీ నర్సింగరావు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మంథని డీఈఈపైనా సీఐడీ డీఎస్పీ మహేందర్  ఇదే ఆరోపణ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది.

 ఇందిరమ్మ ఇళ్లపై ఆరా!

 మహాముత్తారం/ మల్హర్ : మండలంలోని పెగడపల్లిలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన జాటోత్ రజిత, వీరమ్మ, వావిల్లా హేమలత, జాటోత్ లహరియా, కీరిబాయి, జాటోత్ గౌతమిబాయి పేరిట మంజూరైన గృహాలను తనిఖీ చయగా.. హేమలత పేరిట సిబ్బంది రెండు విడతల బిల్లులు కాజేసినట్లు తేలింది. మరోవైపు పెగడపల్లి పరిధిలోని ప్రేమ్‌నగర్, ఆంజనేయపల్లి, మామిడిగూడెంలో 2006 నుంచి 2012 వరకు మంజూరైన 400 గృహాలను పరిశీలించారు. మల్హర్ మండలంలోని రుద్రారంలోనూ సీఐడీ అధికారులు విచారణ కొనసాగించారు. హౌసింగ్ అధికారుల తీరుపై సీఐడీ డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రారంలో 1133 ఇళ్లను సర్వే చేయగా.. 44 పాత ఇళ్లకు, 181 కట్టని ఇళ్లకు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. 15 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందారని, 115 పూర్తి కానివి, 56 బినామీ, 15 అవివాహితులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్లించారు. 95 ఇళ్లకు రెండుసార్లు బిల్లులు వచ్చినట్లు నిర్ధరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన డీఈ భాస్కర్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.







 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top