కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ - Sakshi


► మార్కెట్‌లో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం

► ఘటనపై చైర్మన్‌ను ప్రశ్నించిన జానా, భట్టి, వీహెచ్‌

► మార్కెట్‌ కమిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

► ట్రేడర్లు, అధికారులు కుమ్మక్కయ్యారని నేతల ధ్వజం


సాక్షి, ఖమ్మం: వ్యవసాయ మార్కెట్‌లో  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభా పక్షనేత కె.జానారెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి.హనుమంతరావులు సోమవారం మార్కెట్‌ను సందర్శించారు. ఆ తర్వాత మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి వెళ్లారు.  దాడి ఘటనలో రైతులు ఎవరున్నారు..? ట్రేడర్లు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు కదా..? ట్రేడర్లు  చైనా కారం మిల్లుతో ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకుని ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు..?


జెండా పాట ఒకటి ఉంటే.. కొనుగోళ్ల విషయంలో తక్కువకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని భట్టి.. చైర్మన్‌ ఆర్జేసీ కృష్ణతోపాటు మార్కెట్‌ కమిటీ కార్యదర్శిని ప్రశ్నించారు. చైనా కారం మిల్లు విషయం తమకు తెలియదని  కార్యదర్శి సమాధానం ఇచ్చారు. ఒకరిద్దరు ట్రేడర్లు కూడా తాము టీఆర్‌ఎస్‌లో చేరలేదని చెప్పారు. ఇంతలో చైర్మన్‌  ఇటీవలనే కొంతమంది టీఆర్‌ఎస్‌లో చేరారని అనడంతో..  వీహెచ్‌ అంతా దళారులు అనడంతో..అక్కడకు వచ్చిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కాంగ్రెస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో జానారెడ్డి, భట్టి కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలని, దళారులను పక్కన పెట్టాలని చైర్మన్‌కు సూచించారు.


గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. మానవతా దృక్పథంతో కేసులను ఎత్తివేసిందని, రైతులపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేయాలని చైర్మన్‌కు చెప్పారు. కార్యాలయంలో నేతల మధ్య వాగ్వాదంతో.. బయట కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నేతలు ఎవరికి వారు అనుకూల, వ్యతిరేక నినాదాలు చేశారు. సీఎం డౌన్‌డౌన్‌ అంటూ కాంగ్రెస్‌ నేతలు నినాదాలు చేస్తే.. సీఎం జిందాబాద్‌ అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు నినదించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ గణేష్‌ రెండు వర్గాల నేతలను అక్కడి నుంచి బయటకు పంపించారు.


చైర్మన్‌తో చర్చించిన అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడుతూ ట్రేడర్లు, అధికారులు కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చాంబర్‌ ఆఫ్‌ ట్రేడర్స్‌ స్వచ్ఛందంగా ఉండేవారని, ఇప్పుడు అధికారికంగా పార్టీలో చేరడంతో వీరు చేసే చేష్టలను అధికారులు కూడా నియంత్రించడం లేదని మండిపడ్డారు. ఫలితంగా ధర అందక మిర్చి రైతులు నష్టపోయారని అన్నారు. ఇక్కడి నుంచి బయలుదేరిన నేతలు దానవాయిగూడెం జైలుకు వెళ్లి రైతులను పరామర్శించారు.


అనంతరం అక్కడే ఉన్న రైతు కుటుంబాలను కూడా ఓదారుస్తూ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  వారి వెంట డీసీసీ అధ్యక్షుడు అయితం సత్యం, పార్టీ నేతలు పి.దుర్గాప్రసాద్, జావెద్, తాజుద్దీన్‌ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top