మన అభ్యర్థిని గెలిపించుకుందాం

మన అభ్యర్థిని గెలిపించుకుందాం - Sakshi


టీ కాంగ్రెస్ నేతలతో ఆజాద్  22 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ



హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని, అంకితభావంతో వ్యవహరిద్దామని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సూచించారు. మండలి ఎన్నికల నేపథ్యంలో ఆజాద్, వయలార్ రవి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా గురువారం హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు, విడివిడిగా మంతనాలు కూడా జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ప్రత్యర్థి పార్టీలు అనుసరిస్తున్న వ్యూహం, కాంగ్రెస్‌లో అంతర్గత సమస్యలు, వాటి పరిష్కారానికి మార్గాలు తదితర అంశాలపై మాట్లాడారు. ఒక మహిళకు పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించామని, గెలిపించి అంకితభావాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని ఆజాద్ వారికి చెప్పారు. గురువారం 10 మంది ఎమ్మెల్యేలతో భేటీకాగా.. శుక్రవారం మరో ఏడుగురు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ, కె.జానారెడ్డి ఇతర ముఖ్యనేతలు కూడా ఆజాద్‌తో సమావేశమయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేకు పార్టీ విప్ సంపత్‌కుమార్ శుక్రవారం విప్‌ను జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకుల లలితకు ఓటేయాలని ఆదేశించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, యాదయ్య, కోరం కనకయ్య, విఠల్ రెడ్డికి కూడా విప్‌ను అందించనున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.



నేతలకు దానం విందు



 కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ తన నివాసంలో ఆజాద్, వయలార్ రవి, కుంతియాలకు విందు ఇచ్చారు. వారితో పాటు ఉత్తమ్, భట్టి, జానా, షబ్బీర్ అలీ తదితరులు దీనికి హాజరయ్యారు. అయితే పార్టీ మారడానికి దానం సిద్ధమైనట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ విందు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top