కేసీఆర్‌.. నయా హిట్లర్‌

Congress Party In-charge of state affairs fire on ts cm kcr - Sakshi

ఎమ్మెల్యేలను కొనడం ఏం రాజనీతి..?: ఆర్‌.సి.కుంతియా

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్‌ హిట్లర్‌లా ప్రవరిస్తున్నాడని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా అన్నారు. ఇందిరమ్మ రైతుబాటలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ కార్యకర్తలకు గురువారం ఖమ్మంలో భూ రికార్డులపై అవగాహన సదస్సు–శిక్షణ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో కుంతియా మాట్లాడుతూ ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు భూములిచ్చి.. సొమ్ములిచ్చి కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కొనసాగించడం ఏ రకమైన రాజనీతి అని ప్రశ్నించారు. కేంద్రంలో, రాష్ట్రంలోని ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని, తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. సోనియా, రాహుల్‌ నేతృత్వంలో 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 39 జీవో ద్వారా రైతులు, రైతు కూలీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని రెవెన్యూ రికార్డులను పటిష్టం చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసే సీసీఎల్‌ఏకు మూడేళ్లుగా అధికారి కరువయ్యారని, రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రభుత్వం నిద్రపుచ్చిందన్నారు. డీసీసీ అధ్యక్షులు అయితం సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల సెక్రటరీ సతీశ్‌ జార్బోలి, ఎంపీ రేణుకాచౌదరి శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్‌నాయక్, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ యాదవ్, కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ కోదండరెడ్డి పాల్గొన్నారు.  

టీఆర్‌ఎస్‌ది బలవంతపు భూసేకరణ: ఉత్తమ్‌
కాంగ్రెస్‌ హయాంలో పేదలకు 10 లక్షల ఎకరాలను ఇస్తే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో బలవంతపు భూసేకరణ ద్వారా వాటిని లాక్కుంటోందని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. మూడున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైందన్నారు. పర్సంటేజీలు వచ్చే మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు మాత్రమే ప్రభుత్వం రూ.50 వేల కోట్లు విడుదల చేసిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top