కాంగ్రెస్ నేతల అంతర్మథనం

కాంగ్రెస్ నేతల అంతర్మథనం - Sakshi


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో పాటు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్ నేతలతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జరిపిన సమీక్ష వాడివేడిగా సాగింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఒక్కో నియోజకవర్గానికి 45 నిమిషాలకు పైగా జరిగిన ఈ సమీక్షలో సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓటమిపై నియోజకవర్గాల వారీగా చర్చ జరిగింది.

 

ఈ సందర్భంగా గత ఎన్నికలలో కుదుర్చుకున్న పొత్తుల ప్రభావం, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడవడం, పార్టీకి దశాదిశ నిర్దేశించే నేతలు కరువు కావడం లాంటి అంశాలపై జిల్లా పార్టీ నేతలు తమ వాదనలు వినిపించారు. యథావిధిగానే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న జిల్లా నాయకులు భవిష్యత్తు గురించి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన మాటలను విని గంపెడాశతో వెనుదిరిగారు.

 

పొత్తు పొడవలేదా?

గత ఎన్నికలలో సీపీఐతో పొత్తు ప్రభావంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. సీపీఐతో కుదుర్చుకున్న పొత్తు నష్టం చేసిందనే భావనను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసినట్టు సమాచారం. కచ్చితంగా గెలిచే స్థానాల్లో చివరి నిమిషంలో సీపీఐ అభ్యర్థులను ప్రకటించడం, మరోవైపు ఖమ్మం ఎంపీ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో నష్టం వాటిల్లిందని పలువురు నేతలు వాదించారు. ముఖ్యంగా కొత్తగూడెం వంటి బలమైన స్థానాన్ని సీపీఐకి అనివార్య పరిస్థితుల్లో ఇచ్చిన కారణంగా అక్కడ గెలవాల్సిన స్థానాన్ని కోల్పోయామని, సీపీఐతో పొత్తు లేకుంటే మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవారమనే భావన సమీక్షలో వ్యక్తమయింది.

 

ఆమె పెత్తనమేంటి?

ఇక, పార్టీ గ్రూపు తగాదాలపై కూడా సమీక్షలో వాడివేడిగానే చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా పార్టీపై ఎంపీ రేణుకాచౌదరి పెత్తనమేంటని పలువురు పార్టీ నేతలు టీపీసీసీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఆమె వైఖరి కారణంగా జిల్లాలో పార్టీ నష్టపోతోందని, ఆమెను జిల్లా పార్టీ విషయంలో పక్కన పెట్టాలని, ఆమె వల్లే జిల్లాలో పార్టీ గ్రూపులుగా విడిపోవాల్సి వస్తోందని ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఓ అడుగు ముందుకేసి తన ఓటమికి రేణుక వ్యవహారశైలే కారణమని చెప్పినట్టు తెలిసింది.

 

తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో తెలంగాణవాదంతో టీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరిందని, తెలంగాణ వాదం బలంగా లేని ఖమ్మం జిల్లాలో ఈ విషయంలో లాభపడాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గ్రూపు తగాదాలే కారణమని నేతలు అభిప్రాయపడ్డారు. డీసీసీ అధ్యక్షుడిని వెంటనే నియమించాలని, అన్ని వర్గాలను సమతుల్యంతో కలుపుకుని పోయే నేతను ఎంపిక చేయాలని  వారు టీపీసీసీ దృష్టికి తీసుకువచ్చారు.

 

తనకు ఎన్నికలలో సహకరించలేదన్న ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఫిర్యాదు మేరకు నియోజకవర్గంలోని 16 మంది నేతలను టీపీసీసీ సస్పెండ్ చేసింది. కాగా, స్థానిక నాయకత్వానికి తెలియకుండా ఢిల్లీ స్థాయిలో పార్టీలో చేరికలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. స్థానిక నాయకత్వానికి తెలియకుండానే కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరుతున్నారని, కనీసం చేరేంతవరకు కూడా తమకు సమాచారం ఉండడం లేదని జిల్లా కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ దృష్టికి తీసుకొచ్చారు.

 

భవిష్యత్తు మనదే...

ఇక, ఎన్నికలలో ఓటమి పాలయినప్పటికీ పార్టీ సంస్థాగతంగా బలంగానే ఉందని, భవిష్యత్తు బాగుంటుందనే ఆశాభావాన్ని జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంపై అవసరమైతే న్యాయపోరాటానికి దిగాలని కోరారు. మరోవైపు, జిల్లాలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీనే కారణమనే వాదనను బలంగా తీసుకెళ్లేలా కృషి చేయాలని కోరారు.

 

జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికలపై ఉన్న స్టేను వీలున్నంత త్వరగా ఎత్తివేయించి ఎన్నిక జరిపేలా కృషి చేయాలని కూడా కోరారు.  కాగా, పార్టీ బలోపేతానికి గాను నియోజకవర్గాల వారీగా టీపీసీసీ నుంచి ఇన్‌చార్జులను నియమించనున్నామని, త్వరలోనే పొన్నాల కూడా జిల్లా పర్యటనలకు వస్తారని టీపీసీసీ వర్గాలు స్థానిక నాయకులకు తెలియజేశాయి. అయితే, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోగ్యం బాగాలేని కారణంగా ఈ నియోజకవర్గ సమావేశం వాయిదా పడగా, మిగిలిన అన్ని నియోజకవర్గాల సమీక్షలు జరిగాయి.

 

ఈ సమీక్షలకు ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వగ్గేల మిత్రసేన, జిల్లా ఇన్‌చార్జి కుసుమకుమార్, జిల్లా పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి శీలంశెట్టి వీరభద్రం, పార్టీ మండల, బ్లాక్ అధ్యక్షులు, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top