దేవరకొండలో తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు

దేవరకొండలో తన్నుకున్న కాంగ్రెస్‌ నేతలు - Sakshi

- పరస్పరం దాడి 


పగిలిన తలలు.. చిందిన రక్తం


 


సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్‌ నాయకులు మళ్లీ తన్నుకున్నారు. పార్టీలోని రెండువర్గాల నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. పూలకుండీలు, టీ కప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. వారిద్దరి తలలు పగిలాయి. దీంతో సమావేశంలో తీవ్ర గందరగోళం.. ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలు తన్నుకున్న విషయం మరువక ముందే భువనగిరిలో మరోసారి బాహాబాహీకి దిగడం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రిజర్వుడ్‌ నియోజకవర్గాలైన తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ ప్రాంత నాయకులతో లీడర్‌ షిప్‌ డెవలప్‌మెంట్‌ సమావేశం ఏర్పాటు చేశారు.



ఈ సమావేశానికి ఏఐసీసీ ఎస్సీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, తెలంగాణ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్‌ పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 15 మంది ముఖ్యుల పేర్లను ముందుగా నిర్ణయించి వారితోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేవరకొండ నియోజకవర్గం సమీక్ష ప్రారంభం కాగానే.. మాజీ జెడ్పీటీసీ గుంజ రేణుక భర్త నారాయణ లేచి ముందుగా ప్రకటించిన జాబితాలో తన పేరు ఎందుకు లేదని, రేపటి ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి తనతో అవసరం లేదా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో తనను లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న నీ పేరెందుకు రాయాలని ఇన్‌చార్జి జగన్‌లాల్‌నాయక్‌ తన ముందు ఉన్న పూలకుండీని నారాయణవైపు విసిరాడు.



అది అతని తలకు తాకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో ఇరువురు బాహాబాహీకి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురిని విడిపించబోయిన ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్‌ కింద పడి స్పృహ కోల్పోయారు. నారాయణ భార్య రేణుక టీ కప్పుతో జగన్‌లాల్‌నాయక్‌ తలపై కొట్టారు. దీంతో అతనికీ రక్తస్రావం అయింది. వెంటనే వారివురిని ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించారు. తలకు కట్లు కట్టుకుని వారు మళ్లీ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ పటిష్టత కోసం విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని పీసీసీ నేతలు రాజీ కుదిర్చి వెళ్లిపోయారు. 



Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top