విందు రాజకీయం!

విందు రాజకీయం! - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్‌లో సీటు ఫీట్లు మొదలయ్యాయి. అగ్రనేతల ప్రాపకం సాధించేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ముందస్తు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ హైకమాండ్‌ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.



బుధవారం రాష్ట్రపర్యటనకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను ఇంటికి ఆహ్వానించడం ద్వారా విందు రాజకీయాలకు తెరలేపారు. టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరించిన చంద్రశేఖర్‌ 2014 ఎన్నికల వేళ కాంగ్రెస్‌ గూటికి చేరారు. అప్పటి నుంచి డిగ్గీరాజాతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో తన ఓటమికి పార్టీలోని ఒకవర్గం కారణమని ఏఐసీసీకి ఫిర్యాదు కూడా చేశారు.



ఈ నేపథ్యంలోనే వికారాబాద్‌ నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునేందుకు వెళ్లి చివరి నిమిషంలో మనసు మార్చుకోవడం.. నియోజకవర్గ రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా పావులు కదపడంతో గ్రూపులకు ఆజ్యం పోసింది. ఈ పరిణామక్రమంలోనే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుకూలవర్గం కాగా మరొకటి వ్యతిరేక వర్గం. ఇటీవల మూడు జిల్లాల పార్టీ సారథుల ఎంపికలోను నేతల మధ్య విభజన స్పష్టంగా కనిపించింది. ఒకరు అవునంటే.. ఒకరు కాదనడం పరిపాటిగా మారడంతో కాంగ్రెస్‌ రాజకీయం రచ్చకెక్కింది.



ఇదిలావుండగా చంద్రశేఖర్‌ ఇటీవల వికారాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రసాద్‌ను ఆహ్వానించలేదు. దీంతో అభిప్రాయబేధాలు మరింత పొడచూపాయి. వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని భావిస్తున్న చంద్రశేఖర్‌ ముందస్తు వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. మంత్రి పదవి కట్టబెట్టినా.. స్వార్థంతో గులాబీ గూటికి చేరడానికి​ప్రయత్నించిన ప్రసాద్‌ తీరును అధిష్టానం జీర్ణించుకోలేకపోతుందని, ఈ పరిణామాలు ఆయన అభ్యర్థిత్వానికి ప్రతికూలంగా తయారవుతాయని చంద్రశేఖర్‌ వర్గం భావిస్తోంది.



ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం జరిగే రాహుల్‌ సభకు హాజరయ్యేందుకు రాజధానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌కు స్వగృహంలో విందును ఏర్పాటు చేయడం వెనుక వ్యూహాత్మక ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం వద్ద తనకు ఉన్న పలుకుబడిని తెలిపేందుకు కూడా ఈ విందు దోహదపడుతుందని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top