బల్దియా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జయకేతనం


మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులుండగా 18 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరో 14 వార్డులను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టులు, స్వతంత్రులు ఒక్క సీటైనా గెల్చుకోకపోవడం గమనార్హం. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం నింపగా.. గులాబీ తమ్ముళ్లు నిరాశకు లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో.. అందులోనూ మంచిర్యాల జిల్లాగా అవతరించనుండడంతో మొదటి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఆ పార్టీ నాయకుల్లో ఆనందం నిం పింది. 1987 నుంచి వరుసగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే బల్దియా పీఠాన్ని కైవసం చేసుకున్నారు. మధ్యలో ఒక్కసారి మాత్రమే స్వతం త్ర అభ్యర్థిగా గెలిచిన వ్యాపారి మంగీలాల్ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం మరోసారి పట్టణ ఓటర్లు ఆ పార్టీకే పట్టం కట్టడం ఆ ఆనవాయితీని కొనసాగించినట్లయింది.



 అసెంబ్లీ ఫలితాలపై ఆశలు..

 మున్సిపల్ ఎన్నికల ఫలితాల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గంపెడాశతో ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో వ్యక్తి ఆధారంగా ఓటింగ్ ఉంటుందని, వీటి ఫలితాలతో అసెంబ్లీ ఫలితాలకు  పొంతన ఉండదని మరోవైపు టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. బల్దియా ఫలితాలు టీఆర్‌ఎస్ అభ్యర్థి దివాకర్‌రావును ఆందోళనకు గురిచేస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అరవిందరెడ్డిలో ఆనందం నింపాయి.



 చైర్‌పర్సన్, వైఎస్ చైర్మన్ పదవులకు పోటీ

 బల్దియాలో కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికపై అంతటా చర్చ సాగుతోంది. మున్సిపాలిటీ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్ పదవుల కోసం ఇప్పటికే పోటీ మొదలైంది. మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్‌గౌడ్ తన వదిన గాజుల కవితకు చైర్‌పర్సన్ పీఠం దక్కేలా విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు యెడ్ల లలిత సైతం చైర్‌పర్సన్ బరిలో ఉన్నట్లు తెలుస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. ఇందుకోసం ఇప్పటికే క్యాంప్ రాజకీయాలూ మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి ముఖ్య అనుచరుడు కల్వల జగన్‌మోహన్‌రావు వైస్ చైర్మన్ పీఠం ఆశిస్తుండగా.. మరో అభ్యర్థి నల్ల శంకర్ సైతం పోటీలో ఉన్నాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top