ఈ ఎన్నికలు విషమ పరీక్షే?

ఈ ఎన్నికలు విషమ పరీక్షే? - Sakshi


సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల్లో ఓటమితో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరుగబోయే మెదక్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలు పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటితేనే కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉంటుందని... లేకపోతే పార్టీ నుంచి వలసలు ఎక్కువయ్యే అవకాశముందని టీపీసీసీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ , ఖమ్మం కార్పొరేషన్లపై దృష్టి సారించారు. ఆదివారం గ్రేటర్ కాంగ్రెస్ నేతలతో గాంధీభవన్‌లో పొన్నాల సమావేశమై పార్టీ గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, మజ్లిస్‌తో పొత్తు వంటి అంశాలపై చర్చించారు.


 


ఈ సమీక్షలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రేటర్ కాంగ్రెస్ నేతలు రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొనడం కాంగ్రెస్‌కు ఊరటనిస్తోంది. దీంతో త్వరలో ఖమ్మం, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ నేతలతోనూ సమావేశమై పార్టీ గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాలని పొన్నాల భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ... ఖమ్మం జిల్లాలో మాత్రం నలుగురు పార్టీ నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో అక్కడ పార్టీ బలంగా ఉందని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు.

 

 ఇక్కడ జిల్లా నేతలంతా ఐక్యంగా పనిచేస్తే కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేయడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు. ఇక పొన్నాల సొంత జిల్లా వరంగల్‌లో కాంగ్రెస్‌కు ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ ఎన్నికల నాటికి సానుకూల పవనాలు వీస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో ప్రజల్లో ఆ పార్టీపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. దీనిని ఓట్ల రూపంలో మలుచుకునే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని పొన్నాల భావిస్తున్నారు. అందుకోసం దీర్ఘకాలిక వ్యూహాన్ని రచించే పనిలో పడ్డారు. మెదక్ పార్లమెంట్‌కు కేసీఆర్ రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశమున్నందున కాంగ్రెస్ తరపున గట్టి అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తున్నారు. ఇక్కడ తనకు టికెట్ ఇస్తే ఈసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమని గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైన శ్రవణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు కూడా. ఆయనతోపాటు మరికొందరు నేతలు కూడా ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు.

 వలసలను ఆపలేమనే భయం..

 

 త్వరలో జరుగనున్న కార్పొరేషన్ల ఎన్నికల్లో ఓటమిపాలైతే.. పార్టీ నుంచి వలసలను నియంత్రించలేమనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకుంది.


 


ఇప్పటికే ఇటీవలి జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పీఠాల అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీలోకి వెళ్లడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించని పక్షంలో... ఈ సారి ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఆపడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ సమీక్షా సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. విఠల్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు టీపీసీసీ నేతలకు సమాచారం అందుతోంది. వీరిని కట్టడి చేసేందుకు నానాపాట్లూ పడుతున్న కాంగ్రెస్ నేతలకు.. కార్పొరేషన్ల ఎన్నికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top