చర్చ లేకుండానే ఆమోదమా?

చర్చ లేకుండానే ఆమోదమా? - Sakshi


సభ జరిగిన తీరు పూర్తిగా అప్రజాస్వామికం: జానారెడ్డి

పంటల ధరలు పతనమవుతున్నాయని ధ్వజం

ఆందోళన చేస్తే రైతులను అరెస్టు చేస్తారా?

రూ.1,000 కోట్లతో మిర్చి రైతులను ఆదుకోవాలి: ఉత్తమ్‌




సాక్షి, హైదరాబాద్‌: పంటల ధరలు పతనమవు తున్నాయని, రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. మిర్చి ధర పూర్తిగా పడి పోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా రన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్కతో కలసి ఆదివారం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ఖమ్మంలో మద్దతు ధర కోసం ఆందోళన చేపట్టిన రైతులను అరెస్టు చేయడం దారుణ మన్నారు.



 ‘‘రైతు సమస్యలు పరిష్కరించాలని కోరిన మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేయడం తగదు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరపాలని ప్రభుత్వాన్ని కోరినా కనీసం స్పందించలేదు. ఆదివారం సభ జరిగిన తీరు పూర్తిగా అప్రజాస్వామికం. ఏదో ఒక రకంగా బిల్లులు ఆమోదించాలనే లక్ష్యంతో అధికార పార్టీ సిద్ధమైంది. కనీసం చర్చ లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో భూసేకరణ బిల్లుకు ఆమోదం జరిగేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ చర్యను, సభ జరిగిన తీరును ప్రజలు గమనిస్తున్నారు.’’ అని అన్నారు.



కేసీఆర్‌ను రైతులు క్షమించరు: ఉత్తమ్‌

ఈసారి పసుపు, మిర్చి, కంది పంటల దిగుబడులకు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారని  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించే పరిస్థితిలో లేదన్నారు. మిర్చి రైతులకు ప్రభుత్వం వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.



ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకుం టోందని, ఇందుకు పోలీసులను కూడా రంగంలోకి దింపడం దారుణమన్నారు.  ఖమ్మం మార్కెట్‌లో ఆందోళన చేసింది రౌడీలని టీఆర్‌ఎస్‌ అనడం దారుణమని  భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం మార్కెట్‌కు వెళ్దామని, రైతులెవరో, రౌడీలెవరో తేల్చకుందామని టీఆర్‌ఎస్‌కు ఆయన  సవాల్‌ విసిరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top