సర్వే సక్సెస్


 సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే జిల్లాలో విజయవంతమైంది. మంగళవారం ఉదయం 8గంటలకే సర్వే ప్రారంభించాల్సి ఉండడంతో అధికారగణం అంతా తెల్లవారుజాము నుంచే విధుల్లో తలమునకలైంది. ఉదయం 6 గంటల కల్లా మండల కేంద్రాలకు హాజరైన సిబ్బంది..అల్పాహారం ముగించుకుని సర్వేకు ఉపక్రమించారు.



ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రారంభమైన సర్వే ప్రక్రియ.. రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 7.89 లక్షల కుటుంబాలున్నట్లు భావించినయంత్రాంగం..రాత్రి వరకు 7.17 లక్షల కుటుంబాలను కవర్ చేస్తూ.. వారి వివరాలు సేకరించినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. మొత్తంగా 27,675 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్న ఈ సర్వేలో దాదాపు 90 శాతం జనాభా నుంచి వివరాలు సేకరించారు.



 జిల్లాలో అధికంగా మర్పల్లి మండలంలో 97.41 శాతం కుటుంబాల వివరాలు సేకరించారు. ఆతర్వాత యాలాల మండలంలో 89.14 శాతం, ఇబ్రహీంపట్నంలో 88.9 శాతం, తాండూరు గ్రామీణంలో 88.89 శాతం వివరాలు సేకరించి అగ్రభాగంలో నిలిచాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ గ్రామంలో అతి తక్కువగా 65.25 శాతం వివరాలు నమోదు కాగా, హయత్‌నగర్ గ్రామీణంలో 66.91 శాతం సర్వే పూర్తయింది.



 అక్కడక్కడా అయోమయం..

 గందరగోళం

 కొన్నిచోట్ల సర్వే ప్రక్రియ గందరగోళంగా మారింది. ఒకే గృహంలో నాలుగైదు కుటుంబాలున్నప్పటికీ.. కేవలం ఒకరి వివరాలు మాత్రమే సేకరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం, తాండూరు, హయత్‌నగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళన చేశారు. తాండూరులో ఏకంగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే గృహాల నమోదులో భాగంగా వేసిన నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు తెలపడంతో కొంత అయోమయం నెలకొంది.



 సర్వేలో ప్రధానాంశాలివీ...

సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా జిల్లాకు చెందిన ప్రముఖుల ఇళ్ళను ఎన్యూమరేటర్లు సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జె.ఎం లింగ్డో, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేల కుటుంబాల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు.



తాండూరులోని రాజీవ్ గృహకల్ప కాలనీలో కిరాయిదారులను రాత్రికి రాత్రి ఖాళీ చేయించిన ఓనర్లు మంగళవారం హడావుడిగా ఇళ్లకు చేరి సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో నిన్నటివరకు ఇక్కడే నివాసమున్న కిరాయిదారుల వివరాలు రికార్డు చేయలేదు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు.



తాండూరు మున్సిపాలిటీ పరిధిలో పలువురు ఎన్యూమరేటర్లు విధులకు గైర్హాజరు కావడంతో స్థానికులు రూట్‌ఆఫీసర్‌ను నిలదీశారు. ఈక్రమంలో వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. దీంతో సదరు అధికారిణి తాను సర్వే చేయలేనంటూ మున్సిపల్ కమిషనర్‌కు రిపోర్టు చేశారు.

     

పరిగిలో స్థానికంగా నివాసం ఉండని పలువురు.. మంగళవారం ఉదయం కల్లా వారి సొంతింటి ముందు హాజరై ఎన్యూమరేటర్లకు వివరాలిచ్చారు.

     

సర్వేలో వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చిన కుల్కచర్ల మండలం ఆలుగడ్డతాండా వాసి పాముకాటుకు గురై మృత్యువాత పడ్డాడు. అదేవిధంగా మోమిన్‌పేట మండలంలో బూర్గుపల్లితాండా వాసి రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందాడు.

     

హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులు వారి ఇళ్లను కిరాయికిచ్చారు. తాజాగా సర్వే నేపథ్యంలో వారిని హడావుడిగా ఖాళీ చేయించిన ఓనర్లు.. వారి వివరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఫలితంగా కిరాయిదారుల వివరాలు రికార్డులోకి రాలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top