రైతన్నకు పూర్తి ‘మద్దతు’


సిద్దిపేట జోన్: రైతాంగానికి మద్దతు ధర అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నదని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి. హరీష్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఖరీఫ్ ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ యేడు ఖరీఫ్ సీజన్ ధాన్యం, మక్కల కొనుగోళ్ల కోసం విస్తృతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 67 మొక్కజొన్న, 168 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొక్కజొన్న ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాలుకు రూ. 1,310, కామన్ గ్రేడ్ వరికి రూ. 1,360, ఏ గ్రేడ్ వరికి రూ. 1,400 చెల్లించేలా  నిర్ణయించామన్నారు. ఖరీఫ్ కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా సిద్దిపేటలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారికంగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 168 కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. వీటిలో 125 ఐకేపీ, 48 పీఏసీఎస్ పర్యవేక్షణలో ఉంటాయన్నారు.



ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్ధతు ధరను పొందేందుకు కోతల అనంతరం ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని మంత్రి సూచించారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో ఈ యేడు 24 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వాటిలో బక్రిచెప్యాల, చిన్నగుండవెల్లి, చింతమడక, ఇర్కోడ్, నారాయణరావుపేట, పొన్నాల, పుల్లూరు, తోర్నాల, మాచాపూర్, పెద్దలింగారెడ్డిపల్లి, ఖాతా, నంగునూరు, నర్మెట, పాలమాకుల, గట్లమల్యాల, సిద్ధన్నపేట, అల్లీపూర్, చిన్నకోడూర్, గోనెపల్లి, గుర్రాలగొంది, జక్కాపూర్, ఇబ్రహీంనగర్, మైలారం, రామంచ గ్రామాలున్నట్లు ఆయన తెలిపారు.



 ఖరీఫ్ కొనుగోళ్లకు సంబంధించి చెల్లింపులను వేగవంతంగా జరిపేందుకు ఆన్‌లైన్ విధానాన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామన్నారు. రైతులకు 72 గంటల్లోగా ఆన్‌లైన్ ద్వారా బిల్లులు చెల్లిస్తామన్నారు. మరోవైపు సంబంధిత రైతుకు బిల్లుకు సంబంధించిన చెల్లింపు ధర, తేదీతో కూడిన వివరాలను ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా అందిస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడుతున్నామన్నారు.



ఆ దిశగా తొలి విడతలో ఆరు కేంద్రాలకు రూ. 35 లక్షలు మంజూరు చేశామన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 130 కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వ స్థల సేకరణలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై ఉందన్నారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో కూరగాయల, మాంస మార్కెట్‌గా రూపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఆరు కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించడం జరిగిందని త్వరలో నిధులు మంజూరు కానున్నయన్నారు.



 ఈ నిధుల ద్వారా కూరాయల మార్కెట్‌లో కోల్డ్ స్టోరేజీ కేంద్రం తో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీలో కనీస మౌలిక వసతుల కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశామన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డు అభివృద్ధికి రూ. 12 కోట్లు మంజూరు అయ్యాయని, వారం రోజుల్లోగా పనులు ప్రారంభం జరిగేలా చర్యలు చేపడుతారన్నారు.



 సిద్దిపేటలో సుభోజన పథకం..

 సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన సుభోజన పథకాన్ని త్వరలో సిద్దిపేటలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులోని రైతులకు, మాతా శిశు సంక్షేమ కేంద్రం, సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలోని రోగులకు, రోగుల బంధువులకు 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, యార్డుకొస్తున్న ధాన్యం వివరాలను మంత్రి అధికారులనడిగి తెలుసుకున్నారు.



ఈ సందర్భంగా మద్దతు ధరల పోస్టర్లను, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ శరత్, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక, జిల్లా సహకార శాఖ అధికారి సాయికృష్ణుడు,  సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడి, డీఎల్‌సీఓ ప్రసాద్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య, తహశీల్దార్ రాములు, ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి ఎన్‌వైగిరి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చందు, టీఆర్‌ఎస్ నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, శేషుకుమార్, వ్యవసాయ శాఖ అధికారులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top