టెన్త్‌లో పాఠాల బట్టీకి ఇక చుట్టీ!

టెన్త్‌లో పాఠాల బట్టీకి ఇక చుట్టీ!

  • పాఠ్యాంశాలను ఆకళింపు చేసుకోవాల్సిందే

  •   టెన్త్ పరీక్షా పత్రాల తయారీలో సమూల మార్పులు

  •   ఒక్కసారి పరీక్షలో వచ్చిన ప్రశ్నలు మళ్లీ రావు

  •   విద్యార్థి సృజనాత్మకత, విషయ పరిజ్ఞానానికే పెద్దపీట

  •   {పశ్నపత్రాల తయారీకి వెయిటేజీ పట్టిక రూపకల్పన

  •   ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు!

  •  సాక్షి, హైదరాబాద్: ఇక బట్టీ చదువులు కుదరవు! పాఠ్యాంశాలను ఆమూలాగ్రం చదివి ఆకళింపు చేసుకోవాల్సిందే. ప్రతి ప్రశ్నకు సొంతంగా ఆలోచించి జవాబులు రాయాల్సిందే. పరీక్షల్లో ఇంతకుమందు వచ్చిన ప్రశ్నలేవీ మళ్లీ రావు. క్వశ్చన్ బ్యాంకులు, గైడ్లు, పాఠ్య పుస్తకాల్లోని ప్రశ్నలకూ నో చాన్స్! పదో తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పనలో ఇకపై ఈ నియమాలను కచ్చితంగా పాటించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి పరీక్షల నిర్వహణలో భారీ సంస్కరణలను అమలు చేయబోతోంది. 

     

    విషయ అవగాహన, స్వీయ రచన, సృజనాత్మకత, విలువలు, జాతీయ సమైక్యత తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభను పరీక్షించేందుకే పెద్దపీట వేయబోతోంది. వీటిని దృష్టిలో ఉంచుకునే ప్రశ్నలు రూపొందించనున్నారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా ప్రశ్నపత్రాల్లో ఉండాల్సిన ప్రమాణాలు, వాటికి కేటాయించాల్సిన మార్కులను నిర్దేశిస్తూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) వెయిటేజీ టేబుల్స్‌ను రూపొందించింది. 

     

    ప్రశ్నపత్రంలో వ్యాసరూప, లఘు, స్వల్ప సమాధానాలు, బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఈ వెయిటేజీ పట్టికను గీటురాయిగా పరిగణించనున్నారు. ప్రశ్నల తయారీలో అన్ని పాఠాలకు సమాన ప్రాధాన్యత ఉండనుంది. ఫలానా పాఠం నుంచి వ్యాసరూప ప్రశ్నలు వస్తాయని, మరో పాఠం నుంచి రెండు మార్కుల ప్రశ్నలు వస్తాయనే విభజన కూడా ఉండదు. ఇప్పటికే పదో తరగతి పరీక్షల నిర్వహణలో అంతర్గత (ఇంటర్నల్) పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం... ప్రతి సబ్జెక్టుకు 20 శాతం మార్కులను కేటాయించి, 80 శాతం మార్కులను ఎక్స్‌టర్నల్ పరీక్షలకు కేటాయించిన సంగతి తెలిసిందే.

     

     ఉపాధ్యాయులకు అసలు పరీక్ష

     గత నాలుగైదేళ్లలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే దాదాపు అన్ని ప్రశ్నలూ పునరావృతమై కనిపిస్తాయి. వాటి సమాధాలను బట్టీ కొట్టి చదివితే పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్లే. దీంతో ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో బట్టీయాన్ని ప్రోత్సహించే వారు. ఇప్పుడు సమూల మార్పులు తీసుకురానుండడంతో అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు పరీక్షగా మారనుంది. ప్రశ్నలు ఏ రూపంలో వచ్చినా జవాబు రాసేలా విద్యార్థులకు సబ్జెక్టుపై లోతైన అవగాహన కల్పించడంతో పాటు పాఠాల్లోని సారాన్ని నూరిపోయాల్సి ఉంటుంది. అయితే ఈ విధానంలో ప్రశ్నపత్రం క్లిష్టంగా ఉంటుందని విద్యార్థులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొంటున్నారు. 

     

    ఉన్నత, మధ్యమ, దిగువ స్థాయిల్లో ప్రతిభా సామర్థ్యాలు గల విద్యార్థులను దృష్టి పెట్టుకునే ప్రశ్నపత్రాలను రూపొందిస్తారని చెబుతున్నారు. విద్యా రంగంలో సంస్కరణలపై దౌలత్ సింగ్ కోఠారి, యశ్‌పాల్ కమిషన్‌ల సిఫారసుల అమలుతోపాటు జాతీయ విద్యా ప్రణాళిక-2004, విద్యాహక్కు చట్టం-2009లోని ప్రమాణాలను అందుకోడానికే ఈ సంస్కరణలను ప్రవేశపెడుతునట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top