పార్టీ పదవులేవి సారూ...!

పార్టీ పదవులేవి   సారూ...! - Sakshi


జిల్లాలోని మూడు ప్రధాన పార్టీలకు జిల్లా కమిటీల్లేవు

 

జిల్లా అధ్యక్షులు ఎన్నికై నెలలు గడుస్తున్నా కమిటీలు వేసుకోలేని పరిస్థితి

టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ కేడర్లలో నిస్తేజం

పార్టీ పదవుల కోసం తహతహలాడుతున్న కార్యకర్తలు

కేసీఆర్ ఆమోదం కోసం అధికార పార్టీ నేతల ఎదురుచూపులు

అగ్రనేతలు అందుబాటులో లేక టీడీపీ కమిటీ జాప్యం

  ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే అంటున్న ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్


 

జిల్లా రాజకీయం స్తబ్దుగా నడుస్తోంది. అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు తమ పనులు తాము చేసుకుంటు వెళ్లిపోతున్నారే తప్ప రాజ కీయ పరిణామాలను ప్రభావితం చేసే స్థాయిలో పనిచేయడం లేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్దగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన కాంగ్రెస్ పార్టీ గ్రూపు గొడవలు, ఇతర కారణాలతో బిజీగా ఉంటుండగా, మరో ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కేడర్ అయితే నిస్తేజంలో మునిగిపోయింది. పార్టీ పరంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలేవీ లేకపోవడంతో అన్ని స్థాయిల్లో పార్టీ కార్యకర్తలు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీలకు పార్టీ జిల్లా కమిటీలను ఇంత వరకు ఏర్పాటు చేసుకోలేదంటే జిల్లాలో రాజకీయం ఎంత స్తబ్దుగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పార్టీల్లో అధికార టీఆర్‌ఎస్ కూడా ఉండడం మరో విశేషం.

 

నల్లగొండ : ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ రాష్ర్ట, జిల్లా అధ్యక్షులను ఎన్నుకుని రెండు నెలలు గడిచిపోయింది. జిల్లా అధ్యక్ష ఎన్నిక సందర్భంగా నెల రోజుల్లో పార్టీ జిల్లా కమిటీని నియమిస్తామని పార్టీ పెద్దలు చెప్పారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. వాస్తవానికి ఆ పార్టీ జిల్లా కమిటీలో 40 మందికిపైగా నేతలకు స్థానం ఇవ్వొచ్చు. అయితే, పార్టీ పదవులు ఇస్తే.. నామినేటెడ్ పోస్టులు రావనే సంకేతం ఆ నేతలకు వెళ్తుందనే కారణంతో పార్టీ జిల్లా కమిటీలు వేసుకునేందుకు అధినేత కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. అలా అయితే, మరి నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో, అధికార పార్టీగా ఉండి కనీసం జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితిలో గులాబీ దళం మల్లగుల్లాలు పడుతోంది. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి పేర్లు కూడా ఖరారైనా పార్టీ జిల్లా కమిటీని ప్రకటించేందుకు ఆలస్యం అవుతుందని జిల్లా పార్టీ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పా రు. ఈ నేపథ్యంలో పదవుల కోసం గులా బీ సైనికుల నిరీక్షణ ఎప్పుడు ముగుస్తుం దో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

 

కల్తీ తీసేసి ‘ఫ్రెష్ కాంగ్రెస్’

ఇక, ఎలాగూ అధికారం లేదు కనుక కనీసం పార్టీ పక్షానైనా పదవులిచ్చి తమ పార్టీ కార్యకర్తలను సంతృప్తి పర్చాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోలేకపోతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బూడిద భిక్షమయ్యగౌడ్ నియామకమై దాదాపు ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు. పార్టీ జిల్లా కమిటీని వేస్తే కనీసం 70-90 మంది వరకు నేతలకు పార్టీ పదవులు ఇవ్వవచ్చు. కానీ, పార్టీలోమాత్రం ఎలాంటి చలనం కనిపించడం లేదు. పార్టీ తరఫున జిల్లా నుంచి చాలా మంది నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకోవడం లేదని, సీఎల్పీ నేత, పీసీసీ అధ్యక్షుడిగా వారయితే పదవులు తీసుకున్నారు కానీ కనీసం తమకు పార్టీ పదవులు ఇప్పిం చేందుకు కూడా వారు సిద్ధంగా లేరనే చర్చ కాంగ్రెస్ కేడర్‌లో జరుగుతోంది. అయితే, కాంగ్రెస్ వర్గాలు మా త్రం జిల్లా కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని చెపుతున్నాయి. గత ఎన్నికలలో పార్టీకి విధేయంగా ఎవరు పనిచేశారు? వేరే పా ర్టీ నేతల ప్రలోభాలకు లొంగింది ఎవరు? గ్రామస్థాయిలో సమర్థంగా ఎవ రు పనిచేస్తున్నారనే అం శాలపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వచ్చే నెలలో పదవుల పందేరం ఉంటుందని నేతలు చెపుతున్నారు.



 అగ్రనేతలు అందుబాటులో లేక...

  జిల్లాలో చాలా స్తబ్దుగా ఉన్న మొదటి పార్టీ టీడీపీఅని చెప్పుకోక తప్పదు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్టీ కేడర్‌ను రక్షించుకోవాల్సిన టీడీపీ కనీసం జిల్లా కమిటీని కూడా ఏర్పాటు చేసుకోలేకపోతోంది. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షుడి విషయంలో రెండు గ్రూపులుగా నిట్టనిలువునా చీలిన పార్టీ నేతల మధ్య జిల్లా కమిటీ విషయంలో ఏకాభిప్రాయం రావడం లేదని తెలుస్తోంది. తమ వర్గానికి ఎక్కువ పదవులు కావాలంటే తమ వర్గానికి ఎక్కువ కావాలంటారనే ఆలోచనతోనే అసలు జిల్లా కమిటీ ఏర్పాటుపై సమావేశం కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉంది. మరోవైపు  పార్టీ ముఖ్య నేతలైన ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి  కూడా అందుబాటులో లేకపోవడంతో జిల్లా పార్టీ కమిటీ జాప్యం జరిగిందని ఒక నేత ‘సాక్షి’కి వివరించారు. త్వరలోనే  మంచి కమిటీని ఏర్పాటు చేసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే, అటు అధికారంలేక, ఇటు తెలంగాణ విషయంలో దెబ్బతిని, ఓటుకునోటు కుంభకోణంలో డీలా పడిన తెలుగుతమ్ముళ్లకు కనీసం జిల్లా పార్టీ పదవుల పందేరమైనా ఎప్పుడుంటుందో వేచి చూడాల్సిందే.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top