‘కాంట్రాక్టు’పై కమిటీ!

‘కాంట్రాక్టు’పై కమిటీ! - Sakshi


సాక్షి ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వ్యవహారం తెలంగాణ సర్కారుకు చిక్కుముడిలా మారుతోంది. దీంతో ప్రస్తుతానికి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఓ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి, ‘సాధ్యాసాధ్యాలు- అమలు మార్గాలు- విధివిధానాల’పై అధ్యయనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు విడుదలకానున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 40 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని ఇటీవలి  కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో సదరు ఉద్యోగులంతా దీని అమలుపై ఆశలు పెంచుకున్నారు. కానీ ఈ విషయంలో ఒకే జీవో ఇచ్చేసి రెగ్యులరైజ్ చేసే పరిస్థితి లేదని, రకరకాల న్యాయపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 

 ఒక పోస్టులో తాత్కాలికంగా నియమించుకున్న కాంట్రాక్టు ఉద్యోగి సర్వీస్‌ను రెగ్యులర్ చేయాలంటే ఆ ఖాళీని భర్తీ చేయడమే అవుతుందని, తద్వారా ఆయా పోస్టుల భర్తీకి అవసరమైన అన్ని నిబంధనలనూ పాటించాల్సిందేననిఉన్నతాధికారి ఒకరు వివరించారు. మెరిట్, రోస్టర్ పాయింట్, కనీస విద్యార్హత, వయోపరిమితి వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. నిజానికి 2003లో విడుదలైన జీవో 94 ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగాల విషయంలో రోస్టర్, కనీస విద్యార్హతలను తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ నిబంధ నలను పాటించి కాంట్రాక్టు సర్వీసులోకి తీసుకున్న వారిని నేరుగా రెగ్యులరైజ్ చేయొచ్చా? లేక వీరి విషయంలోనూ నోటిఫికేషన్ విడుదల చేసి అందరితోపాటు పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందా? అనే విషయంలో ప్రభుత్వ వర్గాలు న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నాయి. ఒకవేళ పరీక్ష తప్పనిసరయ్యే పక్షంలో సర్వీసును బట్టి కొంత వెయిటేజీ, వయోపరిమితి సడలింపు ఇవ్వాల్సి ఉంటుందని, ఇటీవల పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల్లో కొన్ని పోస్టుల భర్తీ విషయంలోనూ వెయిటేజీ ఇచ్చారని కొందరు అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ సడలింపులు ఇచ్చినా మెరిట్ విషయంలో కాంట్రాక్టు ఉద్యోగులు నిరుద్యోగులతో పోటీపడాల్సి వస్తుంది. పైగా చాలా ఏళ్లుగా పోస్టుల భర్తీ జరగనందున నిరుద్యోగులకూ వయోపరిమితి సడలింపు ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు అనేక పోస్టుల విషయంలో జీవో 94 మార్గదర్శకాల్ని పాటించలేదని అధికారులే అంగీకరిస్తున్నారు. వారిని నేరుగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయపరమైన చిక్కులు రావచ్చునన్న అభిప్రాయం నెలకొంది.

 

 నిజానికి రాష్ట్ర విభజన సందర్భంగా తేల్చిన లెక్కల ప్రకారం కేవలం 23 వేల మంది మాత్రమే కంట్రాక్టు ఉద్యోగులున్నారు. కానీ 40 వేల దాకా ఉంటారనే అంచనా వేసి, ఆ మేరకు క్రమబద్ధీకరిస్తామని కేబినెట్ పేర్కొంది. ఏయే శాఖల్లో వాస్తవంగా ఎందరు కాంట్రాక్టు ఉద్యోగులున్నారనే లెక్కలను అధికారులు ఇంకా సేకరిస్తున్నారు. ఇక ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించినవారిని రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదని మరికొందరు అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ పోస్టుల భర్తీపై ఆశలతో ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న తమ పరిస్థితేంటని విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదన కూడా సహేతుకమే అయినా.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ఆలోచనతో కొన్ని పార్టీల నేతలు వారిని ఎగదోస్తున్నారని ప్రభుత్వ ముఖ్యులు అనుమానిస్తున్నారు. వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ)ను ఏర్పాటు చేసి, వేలాది ఖాళీ పోస్టుల భర్తీకి కసరత్తును మొదలుపెట్టడం ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులను బుజ్జగించవచ్చునని భావిస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా టీపీఎస్సీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 

 సుప్రీం తీర్పే అడ్డంకి!

 

 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ఒకటి అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. గుండగుత్తగా ఉద్యోగులను క్రమబద్ధీకరించడం సాధ్యం కాదంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలంటే 10 శాతం వెయిటేజీ ఇవ్వాలని 2009లో సుప్రీంకోర్టు  సూచించింది. అయితే, ఈ వెయిటేజీకి మార్గదర్శకాలు ఉండాలని పేర్కొంది. క్రమబద్ధీకరణలో రోస్టర్ విధానాన్ని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. వయోపరిమితిలో కూడా సడలింపు ఇచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగిగా నియమితులయ్యే సమయానికి ఉద్యోగ అర్హత వయసు ఉంటే చాలని తన తీర్పులో ఉటంకించింది. కర్ణాటక, హర్యానా రాష్ర్ట ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇదే తీర్పును ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయంలో ఉమ్మడి రాష్ర్టంలో ఆర్థికశాఖ 100 పేజీల సవివరమైన నివేదికను తయారుచేసింది. సీఎం కిరణ్ హయాంలో కొద్ది మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమయంలో ఈ నివేదికను ఆర్థికశాఖ తయారుచేసింది. క్రమబద్దీకరణ సాధ్యం కాదని ఈ నివేదిక స్పష్టం చేసింది.

 

 వెయిటేజీ 15 శాతం...! వెయిటేజీ విషయంలోనూ కొన్ని సవరణలు తర్వాత వచ్చాయి. వైద్య, ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులకు 45 మార్కులు వెయిటేజీ ఇచ్చారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా... 15 శాతం వెయిటేజీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, నేరుగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన దాఖలాలూ ఉన్నాయి.

 

 వైద్య, ఆరోగ్యశాఖలోని ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేశారు.

 సాంఘిక సంక్షేమశాఖలో పనిచేస్తున్న సుమారు 2,500 మంది స్పెషల్ విద్యావాలంటీర్లను నేరుగా క్రమబద్దీకరించారు. వీటిపై ఎవరూ కోర్టును ఆశ్రయించక పోవడంతో ఈ క్రమబద్దీకరణ అమల్లోకి వచ్చిందని అధికారులు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top