గిరిజనుల స్థితిగతుల అధ్యయనానికి కమిషన్


సాక్షి, హైదరాబాద్: గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. విశ్రాంత అధికారి ఎస్.చెల్లప్ప అధ్యక్షతన ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ ఆరు మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజనులు, ముస్లిం మైనారిటీలకు విద్య, ఉద్యోగావకాశాల్లో 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని టీఆర్‌ఎస్ సాధారణ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్ ఈ హామీని పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఒకవైపు గళమెత్తుతుండడం, మరోవైపు త్వరలో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులకు ప్రాధాన్యం ఏర్పడింది. విచారణ కమిషన్‌లో సభ్యులుగా విశ్రాం త ఐపీఎస్ అధికారి కె.జగన్నాథరావు, హెచ్.కె.నాగు ఉన్నారు. ఈ కమిషన్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి జనాభా, సాంఘిక అంశాలపై అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారి విద్య, ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తుంది. షెడ్యూల్డ్ తెగల కేటగిరిలో ఎన్ని జాతుల వారున్నారనే విషయాన్ని  క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కమిషన్ ఆరు మాసాల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ర్టంలో పెరిగిన గిరిజన జనాభా, వారి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, తమను ఎస్టీలుగా పరిగణించాలంటూ వాల్మీకి బోయ, ఖైతి లంబాడాలు ఇచ్చిన వినతిపత్రం పరిశీలన, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు/సంస్థల నుంచి సమాచారాన్ని సేకరిస్తుంది.

 

 ముస్లింల స్థితిగతులపై కమిషన్

 

 తెలంగాణలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.సుధీర్, సభ్యులుగా రిటైర్డ్ సీనియర్ అధ్యాపకుడు ఎంఏ బారీతో పాటు మరొకరిని నియమించారు. ముస్లింల ఉపాధి, సంక్షేమం, పథకాల అమలు, తదితర అంశాలపై సమగ్ర సర్వే, విచారణ జరిపి ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top