ఆబ్కారీలో పదోన్నతుల ప్రహసనం

ఆబ్కారీలో పదోన్నతుల ప్రహసనం - Sakshi


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారీశాఖలో పదోన్నతుల ప్రక్రియ ప్రసహనంగా మారింది. 2012 నుంచి బదిలీలులేవు. దీంతో పదోన్నతుల తతంగం కూడా వెనక్కి వెళుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 10 జిల్లాలకు కంప్యూటర్ విభాగం డిప్యూటీ కమిషనర్(డీసీ)తో కలిపి 11 మంది ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నది నలుగురే. హైదరాబాద్‌తోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు గత కొన్నాళ్లుగా పూర్తిస్థాయి డీసీలు లేరు. ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్లు ప్రస్తుతం ఇన్‌చార్జి డీసీలుగా కొనసాగుతున్నారు.



వీరికి తోడు విభజన నేపథ్యంలో నిజామాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల డీసీలను ఏపీకి కేటాయించారు. ఈ ఏడుగురు డీసీల స్థానంలో ఏపీ నుంచి తెలంగాణకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు మాత్రమే వచ్చారు. ఈ ఇద్దరికి పోస్టింగ్ ఇచ్చినా, మరో ఐదు జిల్లాలకు డీసీలు లే రు. అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 17 ఉండగా, వాటిల్లో ఆరు ఖాళీలున్నాయి. ఇద్దరు ఎక్సైజ్ సూపరింటెండెంట్లను ఏపీకి కేటాయించగా ఏపీ నుంచి ఐదుగురు టీఎస్ శాఖకు వచ్చారు. వీరికి ఎక్కడ చోటివ్వాలో అర్థం కాని పరిస్థితి . పదోన్నతులకు మోక్షం లభిస్తే ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.



కానీ అధికార యంత్రాంగం వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు డీపీసీ ఏర్పాటుకు కూడా ముందుకు రాలేదు. పదోన్నతుల జాబితా రూపకల్పన నుంచి వాటిని ప్రభుత్వానికి పంపించే ప్రక్రియ వరకు అంతా ఒకరిద్దరి కనుసన్నల్లోనే సాగుతోందని, అర్హతలేని వారిని అందలం ఎక్కించే ప్రయత్నాల్లో భాగంగానే ఆలస్యమవుతోందనే ఆరోపణలున్నాయి. ఓ అధికారి పదోన్నతుల ప్రక్రియపై కోర్టును కూడా ఆశ్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీపీసీ ఏర్పాటు చేసి పదోన్నతులకు అర్హులైన వారి జాబితాను ప్రభుత్వానికి పంపించేందుకు కమిషనర్ చంద్రవదన్ నిర్ణయించారు. సోమవారం పదోన్నతుల జాబితా ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు వద్దకు వెళ్లే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లాలో తనకు పోస్టింగ్ ఇప్పిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ అధికారి పైరవీలు చేసుకుంటున్నట్లు తెలిసింది. పదోన్నతుల జాబితా రూపకల్పనలో ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top