పెట్టుబడులతో తరలిరండి

పెట్టుబడులతో తరలిరండి - Sakshi


సింగపూర్ పారిశ్రామికవేత్తలకు కేసీఆర్ పిలుపు



సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కోరారు. గురువారం సింగపూర్‌లో సీఐఐ నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతికి తావు లేకుండా (జీరో కరప్షన్) పరిపాలిస్తాం. తెలంగాణలో ఐటీ రంగానికి మంచి పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. ఇతర పరిశ్రమలతో పాటు ఫార్మాస్యూటికల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ రంగాల్లో అభివృద్ధి మా ప్రాధాన్యత. మా రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతారు. అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా దగ్గరుండి చూస్తారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందడం పరిశ్రమలకు ఒక హక్కుగా చేస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ లోటు ఉంది. దానిని తీర్చే ప్రణాళికలు ఇప్పటికే తయారుచేశాం. రాబోయే ఐదారేళ్లల్లో ఏకంగా 8 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నాం..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. సింగపూర్ పర్యటన రెండో రోజైన గురువారం సీఎం బిజీబిజీగా గడిపారు.



ఉదయం ఇక్కడి భారత హైకమిషనర్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం సీఐఐ సదస్సులో ప్రసంగించారు.



సమావేశం తర్వాత సింగపూర్ విదేశీ, న్యాయశాఖ మంత్రి కె.షణ్ముగం, వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఎస్.ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ప్రసిద్ధ పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించారు.



సాయంత్రం సింగపూర్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. రాత్రికి సింగపూర్‌లో నివసిస్తున్న తెలంగాణవాసులతో కలిసి భోజనం చేశారు.

 

నేడు సెమినార్‌లో ప్రసంగం!

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) పూర్వ విద్యార్థుల సెమినార్‌లో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి లీ సియాన్‌తోనూ సమావేశం కానున్నారు.



ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక వెబ్‌సైట్!

విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణవాసులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవలి సమగ్ర సర్వేలో తమ వివరాలెలా నమోదుచేసుకోవాలోనని ప్రవాస తెలంగాణవాసులు ఆందోళన చెందారని, ఈ మేరకు వారికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన తెలంగాణ సంబరాలు కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... చిన్న దేశమైన సింగపూర్‌లో చాలా మంది తెలంగాణవాదులు పెట్టుబడులు పెట్టి ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అలాంటి పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలని, వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తుందని వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో 30 వేల కోట్ల రూపాయలతో ఉక్కు కార్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొంది స్తున్నామని తెలిపారు. దాని ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కలిగి.. దుబాయ్, మస్కట్ వంటి దేశాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హైకమిషనర్ విజయ్ ఠాకూర్ సింగ్, సంఘం అధ్యక్షుడు బండ మాధవరెడ్డి, సభ్యులు అనుపురం శ్రీనివాస్, శివ, ప్రవీణ్, మహేందర్‌రెడ్డి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top